నవతెలంగాణ-హైదరాబాద్ : గిరిజన బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్బంధించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నగరి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు నవరాత్రి ఉత్సవాల రోజున తెలిసిన యువకులతో కలిసి స్థానిక జాతరకు వెళ్లారు.
కాగా, వారు తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ముగ్గురు బాలికలను వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ప్రతిఘటించిన యువకులను కొట్టి అక్కడి నుంచి తరిమారు. ఒక బాలిక వేడుకోగా ఆమెను వదిలేశారు. మిగతా ఇద్దరు బాలికలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. వారిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
మరోవైపు మరునాడు అక్కడి నుంచి బయటపడిన బాధిత బాలికలు తమ ఇళ్లకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
కాగా, మందీష్ యాదవ్, శంకర్ యాదవ్, ఓం ప్రకాష్ యాదవ్, మరో గుర్తు తెలియని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.