– సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో మత విద్వేషానికి, బుల్డోజర్ రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టారని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగం, అవినీతి, కార్పొరేట్ అనుకూల విధానాలు, అంతకుమించి నిరంకుశ ఫాసిస్టు విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల నేతలను జైళ్లలో నిర్బంధించారని విమర్శించారు. ఇండియా కూటమి మరింత బాధ్యతగా ఐక్యంగా నిలబడితే ప్రజలకు తగిన ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని తెలిపారు. టీడీపీ, జేడీయూలు లౌకిక కూటమివైపు రావాలని సూచించారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తగిన పాఠం నేర్చుకోవాలని కోరారు. ఏపీలో ఫలితాలు నిరంకుశంపై వ్యతిరేకత అని వివరించారు.