సాగు బాటలో.. రైతన్న

– గతేడాదితో పోల్చితే తగ్గని సాగు అంచనా
– అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ
– రెండు మూడు రోజులుగా సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షం
– ఈ నెలాఖరు వరకు కేరళను తాకనున్న నైరుతి పవనాలు
– జూన్‌ మొదటి వారంలోనే సవృద్ధిగా వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ వెల్లడి
– రోహిణికార్తెతో సాగుకు రైతన్న సన్నద్ధం
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌: వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం సాగుకు అనువైన భూమిలో ఈసారి అన్ని రకాల పంటలు కలిపి 2,44,016 ఎకరాల్లో సాగవుతాయని అంచనాగట్టారు. అయితే ప్రతియేడాదిలాగే ఈసారి కూడా వరి సాగు విస్తీర్ణమే సింహభాగంగానే ఉంది. మొత్తం విస్తీర్ణంలో 80శాతం వరి పంటనే సాగవనుంది. ఇక తరువాతి స్థానంలో పత్తి 49,215వేల ఎకరాల్లో ఉండగా.. మొక్కజొన్న కేవలం 1,510ఎకరాల్లో సాగవనున్నట్టు అంచనా వేశారు. ఇప్పటికే సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయాధికారులు ప్రతిపాదించారు. ఇక వానాకాలం మొదటి వారం నుంచే వర్షాలు సవృద్ధిగా ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా దుక్కులు దున్నుతూ రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో వానాకాలం మొదలవుతుంది. అన్నదాతలు తమ పంట పొలాలు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈసారి జూన్‌ ఆరంభంలోనే రుతుపవనాలు ఏర్పడే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వానాకాలం (ఖరీఫ్‌)లో. ఎలాంటి ఎరువుల కొరతలు లేకుండా మందిత వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. ఈ లెక్కన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆర్నెళ్లలో ఒక్కో నెలలో ఏమేరకు ఆయా ఎరువులు అవసరం అవుతాయో కూడా లెక్కలు తీశారు. మొత్తంగా ఈ ఆర్నెళ్ల పంటకాలంలో వినియోగించే యూరియా 22261 మెట్రిక్‌ టన్నులు అవసరం కానున్నాయి.

రైతులకు ఏఈఓలు అందుబాటులో ఉంటారు – వడ్డేపల్లి భాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి
గతేడాది కంటే ఈ వానాకాలంలో పంటల సాగు ఎక్కువ ఉంటుందని అంచనా. గత వానాకాలంలో అన్ని పంటలు కలిపి 2,39,824 ఎకరాలు కాగా ఈ వానాకాలంలో 2,44,016ఎకరాల్లో సాగు ఉండొచ్చని అంచనాకు వచ్చాం. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ్నలు అందుబాటులో ఉంటారు. సేంద్రీయ ఎరువుల వాడకంపైనే ప్రత్యేక దృష్టి సారించాలి. రసాయన ఎరువుల వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలి. ఒకవేళ చీడపీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు అధికారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Spread the love