నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం

– కాళేశ్వరంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బాగంగా ఏర్పాటు చేసిన మేడిగడ్డ బ్యారేజ్‌ను మంత్రుల బృందం శుక్రవారం సందర్శించనుంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకుంటారు. అనంతరం బ్యారేజ్‌ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలు, ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ తదితర అంశాలను ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం అన్నారం బ్యారేజ్‌ ను సందర్శించి ఏర్పడ్డ బుంగలను పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సంబంధమున్న అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, నిర్మాణ సంస్థలు, సబ్‌ కాంట్రాక్టర్లు ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ కవరేజ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా మీడియా బృందాన్ని సైతం తీసుకు పోతున్నారు.

Spread the love