– రాణించిన రాహుల్, జడేజా
– భారత్ తొలి ఇన్నింగ్స్ 252/9
– డ్రా కోసం టీమ్ ఇండియా పోరాటం
– భారత్,ఆసీస్ మూడో టెస్టు నాల్గో రోజు
గబ్బా టెస్టు ఆసక్తికరంగా మారింది. భారత బ్యాటర్లు, బౌలర్లు ఆశించిన ప్రదర్శన చేయలేదు. కానీ వరుణుడు నిలకడగా ఆటకు ఆటంకం కలిగిస్తూ ఉండటంతో బ్రిస్బేన్‌లో భారత్ డ్రా కోసం పోరాడేందుకు ఓ అవకాశం ఏర్పడింది. కెఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) స్ఫూర్తిదాయక అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఆకాశ్ దీప్, జశ్‌ప్రీత్ పదో వికెట్ పోరాటంతో భారత్ ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కింది. మూడో టెస్టులో నేడు ఆఖరు రోజు. రోజంతా వర్షం సూచనలు ఉండటం భారత్‌కు అతిపెద్ద అనుకూలత.
నవతెలంగాణ-బ్రిస్బేన్
కెఎల్ రాహుల్ (84, 139 బంతుల్లో 8 ఫోర్లు), రవీంద్ర జడేజా (77, 123 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత అర్థ సెంచరీలు సాధించారు. మేఘావృత వాతావరణంలో ఆసీస్ పేసర్లు నిప్పులు చెరిగినా.. రాహుల్, రవీంద్ర అసమాన ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. కీలక బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ టీమ్ ఇండియా ఫాలో ఆన్ గండం గట్టెక్కేలా చేశారు. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లి (3), రిషబ్ పంత్ (9), రోహిత్ శర్మ (10) దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో భారత్ 252/9 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్ (27 నాటౌట్, 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జశ్‌ప్రీత్ బుమ్రా (10 నాటౌట్, 27 బంతుల్లో 1 సిక్స్) అజేయంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మరో 193 పరుగులు వెనుకంజలో కొనసాగుతుంది.
ఆదుకున్న రాహుల్, జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 51/4తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియా.. ఐదు మాత్రమే కోల్పోయి విలువైన పరుగులు చేసింది. ఆరంభంలో కెఎల్ రాహుల్ అందించిన క్యాచ్‌ను స్మిత్ నేలపాలు చేశాడు. అంది వచ్చిన అవకాశాన్ని రాహుల్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ నమోదు చేశాడు. రోహిత్ శర్మ (10) పాట్ కమిన్స్ ఓవర్లో అవుటైనా.. రవీంద్ర జడేజా (77) తోడుగా అదరగొట్టాడు. రోహిత్‌తో కలిసి ఐదో వికెట్‌కు 30 పరుగులు జోడించిన రాహుల్.. రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగులు సాధించాడు. ఆరు ఫోర్లతో 85 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రాహుల్ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. రాహుల్ నిష్క్రమించినా.. నితీశ్ కుమార్ రెడ్డి (16)తో కలిసి రవీంద్ర జడేజా పోరాటం కొనసాగించాడు. ఆరు ఫోర్లతో 82 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జడేజా భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. నితీశ్, జడేజా జోడీ ఏడో వికెట్‌కు 53 పరుగులు చేసింది. రాహుల్, జడేజా మెరవటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పోరాట పటిమ కొనసాగించింది.
బుమ్రా, ఆకాశ్ వావ్
రాహుల్, జడేజా, జడేజా నిష్క్రమణతో భారత్ 194/7తో నిలిచింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా.. ఫాలోఆన్ మార్క్ 246 పరుగులు. బ్యాటింగ్ లైనప్ పెవిలియన్‌లో కూర్చోగా భారత్ ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. ఈ సమయంలో టెయిలెండర్లు తెగువ చూపించారు. జశ్‌ప్రీత్ బుమ్రా (10 నాటౌట్), ఆకాశ్ దీప్ (27 నాటౌట్) పదో వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించారు. దీంతో భారత్ ఫాలోఆన్ గండం గట్టెక్కింది. అదనపు భారంతో అలిసిపోయిన కమిన్స్, స్టార్క్‌లు పాత బంతితో బుమ్రా, ఆకాశ్ దీప్‌లను ఇరకాటంలో పెట్టడంలో విఫలమయ్యారు. దీంతో బుమ్రా, ఆకాశ్‌లు అలవోకగా పరుగులు పిండుకున్నారు. బుమ్రా, ఆకాశ్‌లు చెరో సిక్సర్‌తో భారత శిబిరంలో ఉత్సాహం నింపారు. ఫాలోఆన్ మార్క్ దాటడంతో స్టేడియంలో భారత అభిమానులు కేరింతలు కొట్టారు. వర్షం ప్రభావిత టెస్టులో ఆసీస్ మరోసారి బ్యాట్ పట్టేలా చేసింది. దీంతో గబ్బా టెస్టులో డ్రా అవకాశాలు రెట్టింపు అయ్యాయి!.
నేడు వర్షం సూచనలు
భారత్, ఆసీస్ మూడో టెస్టులో నేడు ఆఖరు రోజు. తొలి వర్షంతో సుమారు 90 శాతం ఆట తుడిచిపెట్టుకుపోయింది. నాల్గో రోజు ఆటలో సైతం వరుణుడు ఆటంకం కలించాడు. మూడు సెషన్లలో పలుమార్లు వర్షంతో ఆట నిలిచిపోయింది. దీంతో మంగళవారం కేవలం 57.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. దీనికి తోడు పేసర్ హాజిల్‌వుడ్ గాయంతో మైదానం వీడాడు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్‌లు మాత్రమే వికెట్ల వేట బాధ్యత తీసుకున్నారు. పాత బంతితో వికెట్ల వేట ఆసీస్ పేసర్ల కష్టంగా మారింది. నేడు చివరి రోజు ఆటలో రోజంతా వర్షం సూచనలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవనుంది. మధ్యాహ్నం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో కనీసం రెండు సెషన్ల ఆట సాధ్యపడే అవకాశం వీల్లేదు. ఆసీస్ మరోసారి బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటం, ఆ తర్వాత భారత్ పది వికెట్లు నిలుపుకుంటే బ్రిస్బేన్ టెస్టు నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 445/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) మార్ష్ (బి) స్టార్క్ 4, కెఎల్ రాహుల్ (సి) స్మిత్ (బి) లయాన్ 84, శుభ్‌మన్ గిల్ (సి) మార్ష్ (బి) స్టార్క్ 1, విరాట్ కోహ్లి (సి) కేరీ (బి) హాజిల్‌వుడ్ 3, రిషబ్ పంత్ (సి) కేరీ (బి) కమిన్స్ 9, రోహిత్ శర్మ (సి) కేరీ (బి) కమిన్స్ 10, రవీంద్ర జడేజా (సి) మార్ష్ (బి) కమిన్స్ 77, నితీశ్ కుమార్ రెడ్డి (బి) కమిన్స్ 16, మహ్మద్ సిరాజ్ (సి) కేరీ (బి) స్టార్క్ 1, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 10, ఆకాశ్ దీప్ నాటౌట్ 27, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (74.5 ఓవర్లలో 9 వికెట్లకు) 252.
వికెట్ల పతనం : 1-4, 2-6, 3-22, 4-44, 5-74, 6-141, 7-194, 8-201, 9-213.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 24-3-83-3, జోశ్ హాజిల్‌వుడ్ 6-2-22-1, పాట్ కమిన్స్ 20.5-2-80-4, నాథన్ లయాన్ 21-0-54-1, ట్రావిశ్ హెడ్ 1-0-1-0, మిచెల్ మార్ష్ 2-0-6-0.