సెన్సెక్స్‌కు 1300 పాయింట్ల లాభం

Sensex gains 1300 points– 23వేల చేరువలో ఎన్‌ఎస్‌ఈ
ముంబయి : ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తోన్నట్లు ట్రంప్‌ చేసిన ప్రకటనతో మార్కెట్లు రాణించాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1310 పాయింట్ల లాభంతో 75,157కు చేరింది. నిఫ్టీ 429.40 పాయింట్ల లాభంతో 22,829 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టిసిఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనబడింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.7.72 లక్షల కోట్లు పెరిగి రూ.401.54 లక్షల కోట్లకు చేరింది.
ఎన్‌ఎస్‌ఈ మరో మైలురాయి
నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఈ) 2025 ఏప్రిల్‌లో మరో మైలురా యిని అధిగమించినట్టు తెలిపింది. యూనిక్‌ క్లయింట్‌ కోడ్‌లు, ఖాతాలు 22 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. 2024 అక్టోబర్‌ 20 నాటికి 20 కోట్లుగా ఉన్న సంఖ్య.. ఆరు నెలల్లోనే భారీగా పెరిగిందని పేర్కొంది. మహారాష్ట్ర, యూపీ, గుజరాత్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు 49 శాతం వాటా కలిగి ఉన్నాయని ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ పేర్కొన్నారు. దేశంలో ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు.

Spread the love