వారి జీవితాల్లో స‌రికోత్త మార్పు

A complete change in their livesట్రాన్స్‌ జెండర్స్‌ అంటే సమాజంలో ఓ రకమైన వివక్ష. చీదరింపులు, అవహేళనలు. చివరకు కుటుంబం కూడా వారిని చేరదీయదు. అలాంటి దిక్కు తోచని స్థితిలో మరో మార్గం లేక చాలా మంది భిక్షాటనో, సెక్స్‌ వర్కర్లుగానే బతుకీడుస్తున్నారు. వారి కోసమే బోర్న్‌2విన్‌ అనే సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో చెన్నై నగరంలో బొటిక్‌ ప్రారంభించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ బోటిక్‌ ట్రాన్స్‌ వ్యక్తులకు కొత్త జీవితాన్ని, కొన్ని ఎంపికలు ఇస్తుంది. అవసరమైన వృత్తి శిక్షణ, ఉపాధిని సైతం అందిస్తున్నారు. ఆమే ట్రాన్స్‌ యాక్టివిస్ట్‌ శ్వేతా సుధాకర్‌.
కొన్నేండ్ల కిందట 23 ఏండ్ల ఓవియా ట్రాన్స్‌ ఉమెన్‌గా ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు తనకు ఓ గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు కుటుంబం పూర్తిగా దూరమయ్యింది. తమిళనాడులోని తిరువణ్ణామలై నగరంలో జన్మించిన ఆమె ఇంట్లో పరిస్థితులు కొంతకాలం క్లిష్టంగా ఉన్నాయి. భావోద్వేగపరమైన గొడవలు, వెనుకబాటుతనంతో ఆ కుటుంబం ఎప్పుడూ ఆందోళనగా ఉండేది. ఆ సమయంలో తనలాంటి వాళ్లు చాలా మంది చేసే పనినే తానూ చేసింది. నగరానికి బయలుదేరి చెన్నైలో స్థిరపడింది. ఓ బట్టల దుకాణంలో పనికి చేరింది, దర్జీగా పనిచేసింది. ఆ పని ఆమెకు అంత నచ్చలేదు.
మద్దతు కరువై…
‘నేను బతకడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఉద్యోగంలో చేరి నేర్చుకుంటూ, జీవితాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా కుటుంబం నుండి తిరస్కరణ గాయాలు ఇంకా నన్ను బాధిస్తూనే ఉన్నాయి. ఎవరి మద్దతు లేకుండా కొత్త నగరంలో జీవించడం నాకు అత్యంత కష్టతరమైన పని’ అంటూ ఆమె ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. అయితే ఆమెకు తెలియనిది ఏమిటంటే ఆపన్న హస్తం ఆమెకు దగ్గరలోనే ఉందని. ప్రతిరోజూ ఆమె సైదాపేటలోని తన ఇంటి నుండి పనికి నడుచుకుంటూ వెళుతూ బోర్న్‌2విన్‌ అనే వెల్ఫేర్‌ ట్రస్ట్‌ కార్యాలయాన్ని దాటి వెళ్లాలి. ఇది ట్రాన్స్‌ నాయకురాలైనా శ్వేతా సుధాకర్‌ స్థాపించిన ఎన్జీఓ. ట్రాన్స్‌ కమ్యూనిటీకి విద్య, ఉపాధి, సాధికారతతో ఇది మద్దతు ఇస్తుంది. ఒక రోజు శ్వేత చెప్పులు కూడా లేకుండా నడుస్తూ వెళుతున్న ఓవియాను గమనించి పలకరించారు. ఓవియా తన కథను పంచుకున్న తర్వాత శ్వేత ఆమెతో ‘మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే రండి’ అని చెప్పడం గుర్తు చేసుకున్నారు.
మార్పుకు ఉత్ప్రేరకంగా…
2013లో స్థాపించబడిన బోర్న్‌2విన్‌ తమిళనాడులోని లింగమార్పిడి వ్యక్తులకు విద్య, ఉద్యోగాలను పొందేందుకు సహాయం చేస్తుంది. ర్యాపిడోలో టైలరింగ్‌, బ్యూటీషియన్‌, రవాణా, డెలివరీ ఏజెంట్లుగా 120 మందికి పైగా ట్రాన్స్‌ వ్యక్తులకు సహాయం చేస్తూ వారి జీవితాల్లో మార్పుకు ఉత్ప్రేరకంగా ఉంది. వివక్షను ఎదుర్కొంటూ సాధారణ కాలేజీలో చదువు పూర్తి చేయలేకపోయిన శ్వేత, హెచ్‌ఐవీ అవగాహన కల్పించేందుకు ఒక ఎన్‌జీఓతో పనిచేస్తూనే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ, కరస్పాండెన్స్‌ ద్వారా సోషియాలజీలో ఎమ్మె పూర్తి చేశారు.
మద్దతు వ్యవస్థ లేక
శ్వేత తన వ్యక్తిగత అనుభవంలో ఎన్నో గుర్తించారు. చిన్న పట్టణాల నుండి వచ్చిన చాలా మంది యువ ట్రాన్స్‌ వ్యక్తులు వివక్ష కారణంగా ఉద్యోగం పొందలేకపోతున్నారు. ‘ఇలాంటి వారు చాలా మంది బలవంతంగా లైంగిక పనిలోకి దిగుతున్నారు. ఎందుకంటే వారికి వేరే మద్దతు వ్యవస్థ లేదు. ట్రాన్స్‌ కమ్యూనిటీలో చేరిన తర్వాత కూడా వారికి ఎంపికలు చాలా తక్కువ’ అని ఆమె వివరించారు. ప్రారంభం నుండి బోర్న్‌2విన్‌ టైలరింగ్‌, డ్రైవింగ్‌, విద్య స్పాన్సర్‌షిప్‌లో శిక్షణ అందిస్తోంది. కొనసాగింపు కార్యక్రమాలుగా రెండు బోటిక్‌లను ప్రారంభించారు. ఒకటి సైదాపేటలో, మరొకటి ఉత్తర చెన్నైలో ఉన్నాయి. ఇక్కడ టైలరింగ్‌లో శిక్షణ పొందిన ట్రాన్స్‌ వ్యక్తులు స్థిరమైన జీవనోపాధిని పొందవచ్చు.
కుట్టుపని కంటే ఎక్కువగా…
ఈ సంస్థ చెన్నైలోని డ్రీమ్‌ జోన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఫ్యాషన్‌ డిజైన్‌లో స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. తన ఇంటి పరిస్థితుల కారణంగా తిరిగి అక్కడకు వెళ్లడం సరైనది కాదని ఓవియా గ్రహించింది. కొంతకాలం తర్వాత ఆరోగ్య సమస్యలతో టైలరింగ్‌ ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది. సహాయం కోసం శ్వేతను సంప్రదించింది. ఆ తర్వాతనే సైదాపేట బోటిక్‌ ప్రారంభమైంది. అక్కడ టైలర్లుగా నియమించబడిన ఐదుగురు ట్రాన్స్‌ వ్యక్తులో ఓవియా ఒకరు. బోర్న్‌2విన్‌ ఆమెకు ఫాబ్రిక్‌ కటింగ్‌లో కూడా శిక్షణ ఇచ్చింది. ఆమె ఇప్పుడు కుట్టుపని కంటే ఎక్కువ చేస్తుంది.
అవకాశాలను సృష్టిస్తూ…
ఈరోజు సైదాపేటలోని బోర్న్‌2విన్‌ బోటిక్‌ పూర్తిగా ట్రాన్స్‌జెండర్స్‌చే నిర్వహించబడుతున్న మొదటి బొటిక్‌. చాలా మంది దక్షిణ చెన్నై, ఉత్తర చెన్నైలోని ఎన్‌జీఓ ఏర్పాటు చేసిన టైలరింగ్‌ యూనిట్లలో శిక్షణ పొందుతున్నారు. గ్లోబల్‌ డిజిటల్‌ వ్యాపార సేవల సంస్థ అయిన ఆల్టిమెట్రిక్‌ నుండి నిధులతో ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు బోర్న్‌2విన్‌ 30 మందికి పైగా ట్రాన్స్‌ వ్యక్తులకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చింది. వారిలో 25 ఏండ్ల ఎవాంజెలిన్‌ మార్టినా ప్రస్తుతం డ్రీమ్‌ జోన్‌లో ఫ్యాషన్‌ డిజైన్‌ను అభ్యసిస్తోంది. ఎనిమిది నెలలకు రూ.2.5 లక్షల ఖరీదు చేసే సర్టిఫికేషన్‌ కోర్సును ఆమెకు సంస్థ పూర్తిగా స్పాన్సర్‌ చేసింది. కోర్సు పూర్తి చేసిన తర్వాత బోటిక్‌లో చేరాలని లేదా తన సొంత లేబుల్‌ను ప్రారంభించాలని ఆమె యోచిస్తోంది.
కలను నిజం చేసుకుంది
చిన్నతనంలో తల్లిదండ్రులని కోల్పోయిన మార్టినా ఇంగ్లీషులో బీఏ, ఎమ్మె పూర్తి చేయడానికి ఎంతో శ్రమించింది. ఫ్యాషన్‌ ఆమె కల అయినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల చేయలేకపోయింది. ‘నేను పాఠశాల పూర్తి చేయడానికి అవమానకరమైన ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్‌లో డిగ్రీ వరకు మాత్రమే నేను చదవగలను’ అని ఆమె పంచుకుంది. భాషా అడ్డంకులు, ప్రయాణ సమస్యల కారణంగా చదువు మానేయాల్సిన ఆమె స్నేహితురాలితో కలిసి బోర్న్‌2విన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో చేరింది. తర్వాత మార్టినా తన కోర్సులోనే కొనసాగింది. ఎమ్మె పూర్తి చేసింది. ఇటీవల చెన్నై నెఫ్ట్‌ నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో ఆమె తన డిజైన్‌లను ప్రదర్శించింది.
అన్ని విధాలుగా అండగా
‘మేము వారిని మా ప్రోగ్రామ్‌లలో చేరమని బలవంతం చేయము. కుటుంబం విడిపోవడం, సామాజిక బహిష్కరణ, విద్య లేకపోవడంతో వచ్చే మానసిక, భావోద్వేగ భారం మాకు తెలుసు. మేము మద్దతు ఇచ్చే కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ భిక్షాటన, లైంగిక పనిపై ఆధార పడుతున్నారు. అయితే ఇంటి అద్దె, శస్త్రచికిత్స, ఆహారం, ఆరోగ్య సంరక్షణ కోసం వారికి ఇది అవసరం. అలాంటి వారికి కొత్త బాధ్యతలను స్వీకరించడం చాలా కష్టం. ముఖ్యంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన ట్రాన్స్‌ వ్యక్తులకు మరింత కష్టం. వారు తమ తదుపరి దశలను నిర్ణయించుకోవడానికి సమయం తీసుకుంటారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాము. అదే మా నిబద్ధత’ అంటూ శ్వేత తన మాటలు ముగించారు.

Spread the love