– సామాన్యులు,కూలీ పని చేసేవారే టార్గెట్ గా దందా..
– నెల నెల ఏజెంట్లతో నగదు వసూళ్ల పర్వం
– గడువు ముగిసిన కస్టమర్లకు అందని బహుమతులు
-1600 మందికి పైగా కస్టమర్లకు టోకరా
– ఏజెంట్ల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
వారంతా పేద ,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. నిత్యం కూలీనాలీ పనులు చేస్తేగానీ ఇల్లు గడవని పరిస్థితి.అలాంటి సామాన్య ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని లాటరీ,లక్కీ డ్రా పేరునా ఘరానా మోసానికి పాల్పడిన ఘటన అలస్యంగా మండలంలో వెలుగులోకి వచ్చింది.సామాన్యులు తమ ఆశలను
నెరవేర్చుకోడానికి అప్పు, సోప్పులు చేస్తుంటారు.వాటిని తీర్చుకోడానికి దొరికిన పనిని,ఎదురైనా కష్టాన్ని సైతం అధిగమిస్తుంటారు. ఐతే ఈ మధ్య కాలంలో సామాన్యులు,కూలీపని చేసేవారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రిటర్మెంట్ పూర్తైన వారిని ఆసరా గా చేసుకుని మండలంలో కొందరు బిజినెస్ చేస్తున్నారు. నెల నెల బహుమతులు,ఖరీదైన గిఫ్టులు ఇస్తామంటూ నెల చొప్పున నగదు కట్టించుకుంటూ ఆ డబ్బులను సులువుగా కాజేసేందుకు లాటరీ,లక్కీ డ్రా పేరిట పన్నాగం పన్ని తీర సమయానికి ఘరాన మోసానికి పాల్పడుతున్నారు.కష్టజీవులు వ్యాపారుల ఉచ్చులో పడి దాచుకున్న డబ్బు ,కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుని జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. గతంలో ఈ తరహా ఘటనలు జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది
బోగస్ కంపెనీల పేరుతో వ్యాపారం..
దుబ్బాక మండలంలో కొన్ని బోగస్ కంపెనీల పేరుతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్,కరీంనగర్ లాంటి పేరు మోసిన ప్రాంతాల నుంచి నిర్వాహకులు ఇక్కడికి వచ్చి మాటూ వేసి అనుమతులు లేకుండా దందాలు చేస్తున్నారు.లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం,కారు,వెండి,బైకులు, ఫ్రిడ్జ్,టీవీ,షింగ్ మిషన్, మొబైల్స్,క్యాష్ లాంటి బహుమతులు ఇస్తామని ఊరించే ఆఫర్లను ప్రకటించడంతో ఇదేదో ఆఫర్ బాగుందని సామాన్య ప్రజలు ,కొలువులు, వ్యాపారం చేసేవారు ఈజీగా ఆకర్షితులయ్యారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ కి చెందిన కొందరు కేజీబీఎన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 2019 ” లో ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు.ఐతే (Govt.Regd. of. 2706 of 2019) ఆ కంపెనీ రిజిస్టర్ నెంబర్ ను “ఏ వన్ ఫై ఎంటర్ప్రైజెస్ ” పేరుతో ఓ బ్రోచర్ ముద్రించి, మా కంపెనీలో నెలనెల నగదు చెల్లిస్తే భారీ లాభాలు పొందుతారని మాయమాటలతో నమ్మించారు.ఆ కంపెనీ నిర్వాహకులు వారి వారీ బంధువులను,తెలిసిన వాళ్ళను ఏజెంట్లుగా చేసుకుని సుమారు 1800 మంది కస్టమర్లుని పోగు చేసుకుని వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించారు. కస్టమర్ల నుండి వసూలు చేసి డబ్బుతో మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీ స్థలాలు, దాబాలు, హోటళ్లను ఏర్పాటు చేశారని మరికొందరు లగ్జరీ కార్లల్లో తిరుగుతూ తమను మోసం చేశారని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి వారిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకుని మోసపూరిత ఘటనలు పునరావృతమవ్వకుండా జిల్లాలో అధికారులు అవగాహన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు.
రూ.25 కోట్ల 2 లక్షలు చెల్లింపు..
మండలంలోని పలు గ్రామాల్లో కేజిబీఎన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సామన్య , మధ్య తరగతి ప్రజల బలహీనతను క్యాష్ చేసుకునీ సుమారు 1800 మంది కస్టమర్ల నుంచి 14 నెలలు పాటు నెలకు రూ.1000 చొప్పున మొత్తం రూ.25 కోట్ల 2 లక్షలను ఏజెంట్ల ద్వారా కస్టమర్లు నేరుగా చెల్లించారు. ప్రతి నెలకు సుమారు 5 గురికి బహుమతులు అందుతాయని కస్టమర్లకి ఏజెంట్ల ద్వారా తెలిపిన నిర్వాహకులు మొత్తం 14 నెలలకు గాను 60- 70 మందికి బహుమతులు ఇచ్చి మిగతా వారికి ఇవ్వాల్సిన బహుమతులు గడువు ముగిసిన ఇవ్వకుండా నిర్వాహకులు మొఖం చాటేస్తున్నారు.
ఏజెంట్ల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు..
గడువు దాటినా బహుమతులు రాకపోవడంతో బాధితులు బహుమతుల కోసం ఏజెంట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిర్వాహకులు తమను నమ్మించి మోసం చేశారని ఏజెంట్లు కస్టమర్లకు చెబుతూ, మేం ఎలాగైన మా ద్వారా వేసిన కస్టమర్లకు డబ్బులు ఇస్తామని సర్ది చెబుతున్నారు. గత 4 సంవత్సరాలుగా లాటరీ, లక్కీ డ్రా పేరుతో హైద్రాబాద్ కి చెందినవారు ఈ దందా చేస్తున్నారనీ అసలు నిర్వాహకుడు ఎవరో తెలుసుకుని వారి నుంచి డబ్బులు ,బహుమతి అందించేందుకు కొంత గడువు కావాలని ఏజెంట్లు చుట్టూ తిరుగుతున్న కస్టమర్లకు మరికొందరు హామీ ఇస్తున్నారు. ఏదీ ఏమైనా చివరికి అప్పుతెచ్చైన కస్టమర్లకు, బంధువులు,స్నేహితుల మధ్య ఉన్న సత్సంబంధాలను తొలిగిపోకుండా కొందరు ఏజెంట్లు ప్రయత్నాలు చేస్తున్నారు
అడిగేందుకు వెళితే ఇంట్లో బందీ..
మండలంలో పలు గ్రామాల్లో 1800 మంది ద్వారా లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో 14 నెలలు నగదు చెల్లించుకుని సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.దీంతో హైద్రాబాద్లో ఉన్న నిర్వాహకులను కలిసేందుకు పలువురు ఏజెంట్లు కస్టమర్లను తీసుకొని హైద్రాబాద్ వెళ్లగా వారందరికీ ఓ వింత సంఘటన ఎదురైంది. సదురు నిర్వాహకుడు డబ్బులిస్తానని నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్ళి వారందరినీ మాటల్లో పెట్టీ ఆ ఇంట్లోనే బంధించి పరారయ్యాడు. కేకలు వేయడంతో పక్కనున్న వారీ సహాయంతో భయటపడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు