సర్ పట్ల సుప్రీం తీర్పుపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శ
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రకియను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ వైపరీత్యమని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించిది. వివిధ రాష్ట్రాల్లో బలహీన పౌరుల ఓటు హక్కును పెద్ద ఎత్తున తొలగించడం, బహిష్కరించడం, బెదిరించడం వంటి చర్యలకు దారి తీసిన ఈ ప్రక్రియకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత కల్పించడం ద్వారా సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగపర మైన హామీలకు సంరక్షకులుగా ఆశించిన పాత్రను పోషించడంలో తీవ్రంగా రాజీ పడిందని విమర్శించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో గురువారమొక ప్రకటన విడుదల చేసింది. పిటిషనర్లు ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో పాలు పంచుకునేందుకు పౌరులకు ఉపయోగపడే ప్రాధమిక ఆయుధమైన ఓటు హక్కును ఏకపక్షంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున పత్రాల పరిశీలనకు గురి చేయడం సరైనదేనా? ప్రభుత్వం డిమాండ్ చేసిన పత్రాలు లేవని నిరుపేదలు, వలసదారులు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, భూమిలేని పేదలు, సమాజంలో వెనుకకు నెట్టబడిన వర్గాల వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ‘సర్’ దారి తీసినందున సార్వత్రిక వయోజన ఓటు హక్కు సూత్రాన్ని సుప్రీం తీర్పు దెబ్బతీసిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. మొత్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించింది.
తగిన నోటీసులివ్వకుండా చట్టబద్ధమైన ఓటర్ల పేర్లు తొలగించడం, వచ్చిన వార్తలను, అలాగే భారంతో కూడిన ధృవీకరణ పద్దతులు, సమాజంలో అణగారిన పౌరులు ఎదుర్కొన్న అపారమైన ఇబ్బందులపై అనేక రాష్ట్రాల నుంచి నివేదికలు వచ్చినా వాటిని కోర్టు విస్మరించడం విచారకరమని వ్యాఖ్యానించింది. అల్గారిథమ్‌లపై ఆధారపడినా, ఇంకా పరీక్షించని సాఫ్ట్‌వేర్ ప్రాతిపదికన పశ్చిమ బెంగాల్‌లో ‘‘తర్క వైరుధ్యాలు’’ అనే అభ్యంతరకరమైన భావన కొత్తగా తలెత్తింది. దీనివల్ల కోటిమందికి పైగా ఓటర్లు సందేహాస్పదమైన కేటగిరీలోకి నెట్టబడ్డారు. ఫలితంగా 27లక్షలమంది ప్రజలు సుప్రీం కోర్టు న్యాయపరమైన పరిష్కారం పొందినా, వారు ఓటు హక్కును కోల్పోయారు. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు ప్రజలకు జారీ చేసి, ఇతర గుర్తింపు పత్రాల ద్వారా సంక్షేమ పథకాలను అందజేస్తున్నా, పౌరసత్వం, ఓటింగ్ హక్కులనేవి ఆమోదయోగ్యమైన పత్రాలు కలిగి ఉండడంపై ఆధారపడే విధానాన్ని కోర్టు ధృవీకరించడం దురదృష్టకరం. ఇది, రాజ్యాంగం హామీ కల్పించిన సమానత్వం సిద్ధాంతాన్ని దెబ్బతీసింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే పౌరసత్వం నిర్ధారణ ఎన్నికల కమిషన్ అధికారాలకు అతీతమైనదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఎస్‌ఐఆర్ పట్ల ఎన్నికల కమిషన్ నిర్వహించిన తీరును స్థూలంగా ధృవీకరించడంతో ఆ వాదననే కొట్టిపారేసింది.
సర్ ప్రక్రియ ద్వారా తొలగించబడిన వారి పేర్లన్నింటినీ వారి పౌరసత్వం ధృవీకరించే సంబంధిత అధికారులకు అందజేయాలని ఈసీని కోర్టు కోరింది. ఈ చర్య వారందరినీ తప్పనిసరిగా వారి పౌరసత్వాన్ని నిరూపించుకునేలా నిర్బంధిస్తుంది. ఫలితంగా దేశం యావత్తూ ఏకగ్రీవంగా వ్యతిరేకించిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను రహస్యంగా ప్రవేశపెట్టేందుకు దారి తీస్తుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఎన్నికల కమిషన్ తటస్థత, స్వాతంత్య్రం పట్ల ప్రజలకు గల విశ్వాసం దెబ్బ తింటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు పరిశీలిస్తుందన్న అంచనాలను కోర్టు వమ్ము చేసింది.ఓటు హక్కును సమర్ధిస్తూ, సమగ్ర ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని ఇటీవల జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సాగే ఈ పోరులో భావ సారూప్యత కలిగిన పార్టీలను, శక్తులను సమీకరించేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది.
ప్రజాస్వామ్యానికి తీవ్ర దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



