నవతెలంగాణ – హైదరాబాద్ : సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ లో ఘనంగా నివాళులర్పించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏచూరి చిత్రపటానికి పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ నేతలు, పార్టీ శ్రేణులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏకే గోపాలన్ భవన్‌లో ఎర్రజెండాను ఆవిష్కరించి, విప్లవ నినాదాలతో ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నేతలు మాట్లాడుతూ— దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణలో ఏచూరి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా జవాహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి ప్రారంభించి, రాజ్యసభ సభ్యుడిగా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఆయన చూపిన చొరవ, సిద్ధాంత పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ, సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు తపన్ సేన్, నీలోత్పల్ బసు, ఆర్. అరుణ్ కుమార్, వీరితో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కేంద్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



