నాటో ఎజెండాగా మారిన యుద్ధం

A war that became NATO's agenda– హంగేరియన్‌ ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌
నాటో తన శాంతియుత రక్షణాత్మక స్వభావాన్ని యుద్ధ పిపాసిగా మార్చిందని హంగేరియన్‌ ప్రధాన మంత్రి విక్టర్‌ ఓర్బన్‌ పేర్కొన్నాడు. అమెరికా నేతత్వంలోని మిలిటరీ కూటమి ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే చర్యలు చివరికి రష్యాతో ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దారితీస్తాయని, ఇది విపత్కర పరిణామాలకు దారితీస్తుందని ఉక్రెయిన్‌ వివాదంలో పాశ్చాత్య ప్రమేయాన్ని తీవ్రంగా విమర్శించే హంగేరీ నాయకుడు పదేపదే హెచ్చరించాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో శుక్రవారంనాడు ఓర్బన్‌ మాస్కోలో చేసిన ఆకస్మిక పర్యటనలో సమావేశమయ్యాడు. ఓర్బన్‌ శాంతి పరిరక్షక మిషన్‌లో ఉన్నాడని హంగేరియన్‌ ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి సంభావ్య మార్గాలపై పుతిన్‌, ఓర్బన్‌ల మధ్య చర్చ జరిగింది. మాస్కో, కీవ్‌ స్థానాలు చాలా దూరంలో ఉన్నాయని చర్చల అనంతరం ఓర్బన్‌ అంగీకరించాడు. అయినప్పటికీ ” మేము ఇప్పటికే అత్యంత ముఖ్యమైన దశను తీసుకున్నాము. శాంతి కోసం మా ప్రయత్నాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము” అని ఓర్బన్‌ ప్రకటించాడు. వారం ప్రారంభంలో హంగేరియన్‌ ప్రధాన మంత్రి కీవ్‌ చేరుకున్నారు. అక్కడ అతను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్స్కీతో సమావేశమయ్యాడు. తక్షణం కాల్పుల విరమణ చేసి, చర్చలను ప్రారంభించాలని ఓర్బన్‌ సూచించాడు.తన మాస్కో పర్యటన రోజున, ఓర్బన్‌ రాసిన ఒక వ్యాసం న్యూస్‌వీక్‌లో ప్రచురించబడింది. ఇందులో ఆయన 1999 నుండి హంగరీ సభ్య దేశంగా ఉన్న నాటోకు సంబంధించిన తాజా ధోరణులను ప్రస్తావించాడు. అనేక నాటో కార్యకలాపాలు, కార్యక్రమాలలో బుడాపెస్ట్‌ యొక్క చురుకైన భాగస్వామ్యాన్ని, అలాగే బ్లాక్‌ యొక్క 2 శాతం రక్షణ వ్యయ లక్ష్యంతో తన సమ్మతిని దీనిలో అతను నొక్కి చెప్పాడు. 25 సంవత్సరాల క్రితం తన దేశం చేరిన నాటో శాంతి సంరక్షణ, రక్షణ కోసం నిలిచిన సైనిక కూటమి అని ఓర్బన్‌ పేర్కొన్నాడు. అయితే, ”ఈనాడు శాంతికి బదులుగా యుద్ధాన్ని ఎజెండాగా మార్చి కయ్యానికి కాలుదువ్వే కూటమిగా నాటో మారింది ”అని ఓర్బన్‌ తనవిచారాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని ఇతర భౌగోళిక రాజకీయ ప్రాబల్య కేంద్రాలతో సైనిక ఘర్షణ ఆవశ్యకత లేదా అనివార్యత కోసం నాటోలోని కొన్ని శక్తులు పని చేస్తున్నాయి అని హంగరి ప్రధాని అన్నాడు.అనేక సభ్య దేశాలు ఇటీవల ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో పాల్గొనాలనే కాంక్షతో ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. ఫిబ్రవరి చివరలో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఉక్రెయిన్‌ యుద్ధంలో ఫ్రెంచ్‌ దళాల మోహరింపును తోసి పుచ్చలేమని చెప్పాడు. అతని సూచన జర్మనీ, ఇతర సభ్య దేశాల నుండి విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఫ్రెంచ్‌ దేశాధినేత అనేక సందర్భాలలో వివాదాస్పద ప్రకటనలను రెట్టింపు చేశాడు. మే నెలలో, ఎస్టోనియా, పొరుగున ఉన్న లిథువేనియా లాజిస్టికల్‌, ఇతర నాన్‌-కాంబాట్‌ మిషన్ల కోసం ఉక్రెయిన్‌కు దళాలను పంపడానికి తమ సంసిద్ధతను సూచించాయి. నాటో తన పంథాను మార్చుకోకపోతే అది అనివార్యంగా పతనం అవుతుందని ఓర్బన్‌ రాసిన వ్యాసంలో విస్పష్టంగా ప్రకటించాడు.

Spread the love