పిడుగుపడి యువకుడి మృతి

నవతెలంగాణ-నిజాంసాగర్‌
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి (23) అనే యువకుడు పిడుగు పడి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణమూర్తి రోజు పనిలో భాగంగానే గొర్లను మేపడానికి వడ్డేపల్లి గ్రామ శివారులోని నల్లగుట్ట తండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో పిడుగు పడి ప్రాణాలు కోల్పోయాడు. జీవాలను మేపేందుకు వెళ్లిన యువకుతు తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగుట్ట తండా అటవీ ప్రాంతంలో వెతకడానికి వెళ్లగా కృష్ణమూర్తి విగతాజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుచేపట్టారు.

Spread the love