దాడి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలి

– ఓయూ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీ యూ) అధ్యక్షులు టీ మహేందర్‌
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ బి మెస్‌లో పనిచేస్తున్న వర్కర్‌ చాంద్‌ పాషా పై అకారణంగా దాడి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని ఓయూ కాంట్రాక్టు,ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీ యూ) అధ్యక్షులు టీ మహేందర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఓయూలో బీ మెస్‌ ఎదుట ఓయూ కాంట్రాక్టు,ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్‌ వర్కర్స్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఇలా స్థాయి విస్మరించి ఉద్యోగి పై ఎలా చేయి చేసుకుంటారని పశ్నించారు. విద్యార్థి పై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు ,సైన్స్‌ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. చెన్నారెడ్డి, అడిషనల్‌ చీఫ్‌ వార్డెన్‌ లక్ష్మారెడ్డి ధర్నా దగ్గరకు వచ్చి వర్కర్స్‌కు జరిగిన పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన అధికారులతో కార్మికులు విద్యార్థులు తమపై దాడి చేస్తూ పని చెయ్యకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌ రావు సానుకూలంగా స్పందించి దాడి చేసిన విద్యార్థి పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి చర్యలు జరగకుండా జాగ్రతలు తీసుకుంటామని హామీనిచ్చారు. దాంతో వర్కర్స్‌ ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా టీ మహేందర్‌ మాట్లాడుతూ ఓయూలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చాలీ చాలని వేతనాలతో కాలం గడుపుతూ ఉద్యోగాలు చేస్తుంటే వారి జీవన స్థితిగతులను అర్థం చేసుకోకుండా విద్యార్థులు అకారణంగా దాడి చెయ్యడం దుర్మార్గం అని అన్నారు. కార్మికులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.దాడి చేసిన విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలో ఉద్యోగులపై పదేపదే దాడి జరగ డం ఆందోళన కలిగిస్తుందన్నారు. అధికారులు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగితే కార్మికులందరికీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ యూత్‌ వింగ్‌ నేత అలకుంట హరి , కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ నాయకులు నాగరాజు,శ్రీనివాస్‌,నరేష్‌, లక్ష్మణ్‌ గౌడ్‌ మహేందర్‌ , పుష్ప, లక్ష్మి,శివాజీ,శ్రీనివాస్‌,పద్మ, పాల్గొన్నారు. మరొక వైపు చంద్‌ పాషా సదరు విద్యార్థి పై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Spread the love