ట్రంప్‌ ఉత్తర్వులతో… అదానీకి ఊరట

Trump's orders... a relief for Adaniవాషింగ్టన్‌ : విదేశీయులకు ముడుపులు, అవినీతి, మనీ లాండరింగ్‌, క్రిప్టో మార్కెట్లు సహా వైట్‌ కాలర్‌ నేరాలకు సంబంధించిన కేసుల అమలును ట్రంప్‌ ప్రభుత్వం నిలిపివేస్తోంది. విదేశాలలో వ్యాపార ఒప్పందాలు పొందేందుకు ఆయా దేశాలకు చెందిన అధికారులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికన్లపై విచారణలు నిలిపివేయాలని న్యాయ శాఖను ఆదేశిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వుపై రెండు నెలల క్రితమే సంతకం చేయగా అది ఇప్పుడు అమలులోకి వచ్చిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక తెలిపింది. ఈ ఉత్తర్వు కారణంగా అదానీ గ్రూపునకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారు అమెరికా కోర్టులలో ముడుపులకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్న అజూర్‌ పవర్‌కు కూడా ట్రంప్‌ నిర్ణయం ఊరట కలిగిస్తోంది. ‘వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ పైన, ఆయన కంపెనీల పైన, దాని ఎగ్జిక్యూటివ్‌ల పైన మోపిన క్రిమినల్‌ అభియోగాలను ఉపసంహరిం చుకోవాల్సిందిగా అదానీ న్యాయవాదులు అమెరికా న్యాయ శాఖను కోరుతున్నారు’ అని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలియజేసింది. భారత్‌లో ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాగ్నిజెంట్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై ఉన్న అభియోగాలను తోసిపుచ్చేందుకు న్యూజెర్సీకి కొత్తగా నియమితులైన అమెరికా అటార్నీ జనరల్‌ అలీనా హబ్బా ముందుకు వచ్చారు. ఆమె ట్రంప్‌ మజీ సలహాదారు మాత్రమే కాక ఆయన రక్షణ న్యాయవాదులలో ఒకరు. అమెరికా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక వాణిజ్య ప్రయోజనాలు పొందాలని ట్రంప్‌ భావిస్తున్నారు. అందుకే ఆయన విదేశీ అవినీతి చర్యల చట్టం (ఎఫ్‌సీపీఏ) అమలును నిలిపివేశారు. ముడుపుల ఆరోపణల కారణంగా అమెరికా కంపెనీలు విదేశీ సంస్థలతో పోటీ పడలేకపోతున్నా యని ఫిబ్రవరిలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు లలో ట్రంప్‌ తెలిపారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అమలవుతున్న విధానాలు అమెరికా కంపెనీలను శిక్షిస్తున్నాయని చెప్పారు. ట్రంప్‌ తాజా ప్రకటనతో అనేక కేసుల దర్యాప్తులు అటకెక్కాయి. కేసులు లేదా దర్యాప్తులను ఉపసంహరిం చుకోవాలని డిఫెన్స్‌ న్యాయవాదులు ప్రాసిక్యూటర్లను కోరుతున్నారు.

Spread the love