చదువుపై దృష్టి సారించి ఆదివాసులు అభివృద్ధి చెందాలి

చదువుపై దృష్టి సారించి ఆదివాసులు అభివృద్ధి చెందాలి– ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లాలో ఆదివాసులు చదువుపై దృష్టి సారించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. పోలీస్‌ కార్యాలయంలో ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని దానికి తమ తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికీ అనేక ఆదివాసీ ప్రాంతాలు చదువుకు దూరంగా ఉన్నాయని చదువుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, కల్తీకల్లు బారిన పడకుండా ఆదివాసి ప్రజలకు రాయి సెంటర్‌తో పాటు ఇతర ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాలు వాడటం వాటిని రవాణా చేయడం చట్టరీత్యా నేరమని అటువంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గతంలో తిర్యాణి మండలంలోని గుండాలలో ఏడు కిలోమీటర్ల రోడ్డును, రెబ్బెన మండలంలోని మాడవాయిగూడ నుంచి జెండా కూడా వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డును నిర్మించినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆదివాసుల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రభాకర్‌ రావు, డీఎస్పీ సదయ్య, ఎస్‌బీ సీిఐ రాణా ప్రతాప్‌, సీఐలు సతీష్‌, శ్రీనివాస్‌, అంజన్న, చిట్టిబాబు, ఆదివాసీ సంఘాల నాయకులు మడావి గుణవంతురావ్‌, నర్సింగరావు, కుడిమేత యశ్వంతరావు, ఆత్రం ఆనంద్‌ రావు, ఆత్రం లక్ష్మణ్‌, సోయం బాపూరావు, మోతిరాం, పెందూరు సుధాకర్‌, ఆత్రం భీంరావు పాల్గొన్నారు.

Spread the love