అగ్నిపథ్‌ను సమీక్షించాల్సిందే

Agnipath must be reviewed– మిత్రపక్షాల ఒత్తిడి
– పథకంలో మార్పులు జరిగే అవకాశం
మిత్రపక్షాల ఒత్తిడి కారణంగా అగ్నిపథ్‌ పథకంపై ఆంతరంగిక సమీక్ష జరపవచ్చునని, ఆ తర్వాత అందులో కొన్ని గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రిక తెలిపింది. నాలుగు సంవత్సరాల కాలపరిమితి తర్వాత త్రివిధ దళాల్లో కొనసాగించే సిబ్బంది సంఖ్యను పెంచడం ప్రధాన మార్పుగా కన్పిస్తోంది. ‘ప్రస్తుత నిబంధనల ప్రకారం 25 శాతం అగ్నివీర్‌లను మాత్రమే నాలుగు సంవత్సరాల కాలపరిమితి తర్వాత త్రివిధ దళాల్లో కొనసాగిస్తారు. దీనిని రెగ్యులర్‌ దళాల్లో 60-70 శాతానికి, సిగల్స్‌, గగనతల రక్షణ, ఇంజినీరింగ్‌ వంటి సాంకేతిక, నిపుణత కలిగిన వ్యవస్థల్లో 77 శాతానికి పెంచే అవకాశం ఉంది’ అని ఆ పత్రిక వివరించింది.
న్యూఢిల్లీ : అగ్నిపథ్‌ పథకాన్ని సమీక్షించాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఆ పథకంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేరే వారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌ పథకం కింద నియామక ప్రక్రియ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.
2022 జూన్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు దానిపై నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో కోవిడ్‌ మహమ్మారి తరుముకురావడంతో రెండు సంవత్సరాల పాటు నియామకాలను చేపట్టలేదు. అగ్నిపథ్‌ ప్రకటనతో సైన్యం ఆశ్చర్యపోయిందని, ఆకస్మిక, అనూహ్య ప్రకటనతో నౌక, వైమానిక దళాలు కూడా నివ్వెరపోయాయని సైనిక దళాల మాజీ ప్రధానాధికారి జనరల్‌ ఎంఎం నారావనే గతంలోనే విమర్శించారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రక్షణ దళాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎదురు దెబ్బలు తిన్నది. అగ్నిపథ్‌ పథకంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక వ్యవహారాల విభాగం ఆయా దళాల నుండి అభిప్రాయాలు సేకరించింది. నానాటికీ సైనికుల సంఖ్య తగ్గిపోవడం, ఉన్న వారిని కూడా శాశ్వత ర్యాంకుల్లో తగిన సంఖ్యలో నియమించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన పథకంపై అభిప్రాయ సేకరణ జరిపారు.
సర్వీసు కాలపరిమితిని ఎనిమిది సంవత్సరాలకు పెంచడం, సాంకేతిక సేవల్లో ప్రవేశాలకు వయో పరిమితిని 23 సంవత్సరాలకు పెంచడం వంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. అగ్నిపథ్‌ పథకంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారని ఎన్డీఏ భాగస్వామి అయిన జేడీయూ నేత కేసీ త్యాగి ఇప్పటికే విమర్శించారు. తమ పార్టీ ఎన్డీఏకు బేషరతుగానే మద్దతు ఇస్తోందని, అయితే పథకంలోని లోపాలను తొలగించడానికి దానిపై ప్రభుత్వంలో క్షుణ్ణంగా చర్చ జరగాలని ఆయన సూచించారు. పథకాన్ని సమీక్షించాలని మరో మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ కూడా కోరుతున్నారు.

Spread the love