సర్వర్ తో సతమతం..

– పనిచేయని మిషన్ భగీరథ యాప్
– ముందుకు సాగని సర్వే 
– తీవ్రవత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా తీరు తెన్నుల పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంటింటికి నల్ల కలెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా గత  ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథ పనితీరును తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.  సర్వే చేసేందుకు ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా మిషన్ భగీరథ సర్వేలో సర్వర్ ఎల్లవేళలా బిజీగా వస్తు (మిషన్ భగీరథ అప్లికేషన్)  యాప్ పని చేయకపోవడం వల్ల అనేకరకాల సమస్యలు తలెత్తుతూ  సర్వే ముందుకు సాగటం లేదు. దీంతో పది రోజుల్లో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించిన ఉన్నతాధికారులకు ఏం చెప్పాలో అర్థం కాకా పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. ఎంతో శ్రమ వోడ్చి  ఇల్లు ఇల్లు తిరిగిన సర్వే పూర్తి కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
పది రోజుల్లో సర్వే ముగింపు..!
ఇంటింటి నల్ల కనెక్షన్ల సర్వే ను పది రోజుల్లో పూర్తిచేయాలని పంచాయతీ కార్యదర్శులను అధికారులు ఆదేశించారు.  సర్వర్ సమస్యతో నేటికీ  పంచాయతీ కార్యదర్శులు సర్వే సగానికి కూడా పూర్తి చేయలేకపోయారు. గడువులోగా సర్వే ను  పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ చర్యలేవి  కనబడటం లేదు. దీంతో సర్వే పది రోజుల్లో ముగిసే అవకాశం లేదు. సగానికి పైగా సర్వే పూర్తయినా  గొప్పే అని పలువురు పంచాయతీ కార్యదర్శులు లే  పేర్కొనటం గమనార్హం.
సర్వర్ లో తలెత్తుతున్న సమస్యలు ఇవే..
సర్వర్ చాల నెమ్మదిగా పని చేయడం, ఉదయం 10 దాటితే యాప్ పని చేయకపోవడం, తిరిగి సాయంత్రం 6 ఆర్వాతనే  యాప్ పనిచేయడం. నల్ల కనెక్షన్ లేకపోయినా ఒకే యజమాని పేరు మీద గరిష్టంగా నాలుగు నుండి ఐదు పేర్లు ఉండటం. ఇంటిపేరు రాకపోవడం వల్ల ఒకే పేరుతో అనేకమంది ఉండటంతో సమస్య తలెత్తడం.
ఫోన్ నెంబర్ తప్పనిసరి చేయటం.. ఫోన్ నెంబర్లు లేని వారి డేటాను తీసుకోకపోవడం
వృద్ధాప్యంలోని  వారి వివరాలను నమోదు ఇబ్బందికరంగా మారడం. తప్పును సరిదిద్దేందుకు  ఎడిట్ ఆప్షన్ లేకపోవడం. ఇదంతా ఒక భాగమైతే, ప్రస్తుత వానకాల సీజన్లో ఈ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం పంచాయతీ కార్యదర్శులకు చాలా ఇబ్బందికరంగా మారింది. వ్యవసాయ పనులు ఇప్పటికే ప్రారంభమైనందున వివరాలు ఇవ్వడానికి ఎవరు అందుబాటులో ఉండకపోవటం.
అధికారుల బెదిరింపు ధోరణి తగదు..
సర్వర్  సమస్యతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులు,ఇతర సిబ్బంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులు సర్వే ను పది రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేయడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. దీంతో వారు సర్వర్  సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరినట్లు పలువురు పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు.అయితే అధికారులు మాత్రం అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తూ సమస్య ఏదైనా అప్పగించిన పనిని  పది రోజుల్లో పూర్తి చేయాలని లేదంటే మెమోలు ఇస్తామని బెదిరింపుల ధోరణికి పాల్పడుతున్న ట్లు ఆరోపిస్తున్నరు. ఎంతో కష్టపడి ఇల్లు.. ఇల్లు  తిరిగి పనిచేస్తున్న సర్వర్ సమస్య తలెత్తితే తప్పు తమది కాదని పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు తమకేమీ పట్టినట్టు వ్యవహరిస్తూ సమస్యను  పరిష్కరించకుండా సర్వే పూర్తి చేయాలని బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సర్వర్ నిరంతరాయంగా పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, టార్గెట్ లు విధించకుండా సర్వే చేయడానికి సమయం ఇవ్వాలని, పై అధికారులు ఫీల్డ్ సమస్యలు తెలుసుకొని  సహకరించాలని కోరుతున్నారు.
సమస్య పరిష్కారానికి కాంటాక్ట్ నెంబర్లు: వెంకటేశ్వర్లు (ఎస్ఈ  ఆర్ డబ్ల్యూఎస్ )
సర్వే కార్యక్రమంలో సుమారు 1200 మంది పాల్గొంటున్నారు. దానివల్ల ఏమైనా ఏదో ఒకసారి నెట్వర్క్ ప్రాబ్లం రావచ్చు. బుధవారం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాబ్లం వచ్చింది. గురువారం ఆ సమస్య ఏమి లేదు. మొత్తంగా పెద్దగా సమస్య అంటూ ఎక్కడ లేదు. నెట్వర్క్ సమస్య పరిష్కరించడం కోసం ప్రత్యేకమైన కాంటాక్ట్ నెంబర్లను  9494583494, 9492055553 ఏర్పాటుచేసి గ్రూప్ లలో కూడా వేయడం జరిగింది. అంతే కాకుండా డిపిఓ, ఎంపీడీవోలకు కూడా నెంబర్ ను షేర్ చేసాము. ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కు ఎవరైతే సర్వే చేస్తున్నారో ఆ వ్యక్తి తన మొబైల్ తో సంబంధిత నెంబర్ కు  కాల్ చేస్తే సమస్యను  వెంటనే పరిష్కరిస్తారు.
Spread the love