నల్ల సముద్రంలోకి ఒప్పందం?

 Sampadakiyamనల్ల సముద్ర ప్రాంతంలో నౌకల స్వేచ్ఛా రవాణా, ఇంథన వ్యవస్థలపై అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఇబ్బందుల్లో పడిందా? అంటే వస్తున్న వార్తలు దాన్నే సూచిస్తున్నాయి. పరస్పరం ఇంథన వ్యవస్థల మీద దాడులు చేసుకోకూడదనేది దీనిలో ప్రధానాంశం. దీన్ని ఉల్లంఘించినట్లు రెండు దేశాలు బుధవారం నాడు పరస్పరం ఆరోపించుకున్నప్పటికీ అమెరికా రంగంలోకి దిగితే పరిస్థితి చక్కపడవచ్చు. అయితే తమ వ్యవసాయ, ఎరువుల ఎగుమతి లావాదేవీలకు సంబంధించి తమ రిజర్వు, వ్యవసాయ బాంకులు, ద్రవ్యసంస్థల మీద ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తేనే తమవైపు నుంచి ఒప్పందం అమలు జరుగుతుందని అంటూనే మార్చి 18 నుంచి తాము ఎలాంటి దాడులు చేయలేదని రష్యా అంటోంది. అదంతా నిజం కాదు, ఆరోజు నుంచి ఇప్పటికి ఎనిమిది ఇంథన వసతులపై దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రత్యారోపణ చేయగా క్రిమియాలోని గ్యాస్‌ నిల్వలతో సహా తమ పైప్‌లైన్ల మీద జెలెన్‌స్కీ సేనలు దాడి చేసినట్లు పుతిన్‌ యంత్రాంగం ప్రకటించింది. మధ్యవర్తిగా ఉన్న అమెరికా వైపు నుంచి ఇది రాసిన సమయానికి ఎలాంటి స్పందన, ప్రకటన వెలువడలేదు. ఈ ఒప్పందంతో ఐరోపా యూనియన్‌కు ఎలాంటి ప్రమేయం, పాత్ర లేదు. రష్యా సైనిక చర్యకు ప్రతిగా అమెరికాతో పాటు ఐరోపా దేశాలు కూడా ఆంక్షలు అమలు జరుపుతున్నాయి. బేషరతుగా ఉక్రెయిన్‌ నుంచి పుతిన్‌ సేనలు వైదొలిగితేనే తాము వాటి ఎత్తివేత గురించి ఆలోచిస్తామని ఐరోపా యూనియన్‌ ఇప్పటికే ప్రకటించింది.దీని గురించి అమెరికా నుంచి ఎలాంటి ప్రతిపాదన వెలువడలేదు. అందువలన ఏం జరుగుతుంది, ఒప్పందం ఎలా అమలు జరుగుతుందనేది ఎవరూ చెప్పలేని స్థితి. ఇంథన వ్యవస్థలపై పరస్పరం దాడులు జరుపుకున్నాయా లేదా అన్నదాన్ని పక్కన పెడితే మిగిలిన దాడులు యధాప్రకారం కొనసాగుతూనే ఉన్నాయి.
అలాగే ఉక్రెయిన్‌లో శాంతికి సుముఖంగా ఉన్న కూటమి పేరుతో గురువారం నాడు పారిస్‌లో సమావేశమైన దేశాల వైఖరి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. రష్యా కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చిందని, ఉక్రెయిన్‌ ప్రతిపాదించిన ముప్పయి రోజుల కాల్పుల విరమణ గురించి స్పందిం చలేదని సమావేశం జరగక ముందే ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ధ్వజమెత్తాడు. ఉక్రెయిన్‌కు మరో రెండు బిలియన్ల యూరోల మిలటరీ సహాయాన్ని ఫ్రాన్సు ప్రకటించింది. ఆయుధాలను వేగంగా తరలించటానికి నిర్ణయించింది. ఇది అగ్నికి ఆజ్యం పోసే వ్యవహారం తప్ప మరొకటి కాదు. బ్రిటన్‌, ఫ్రాన్సు దేశాల చొరవతో జరుగుతున్న పారిస్‌ సమావేశం ఉక్రెయిన్‌లో శాంతి స్థాపక దళాల ఏర్పాటు గురించి చర్చించనుంది. అక్కడ నాటో దళాలకు అలాంటి పాత్రను అంగీకరించేది లేదని రష్యా ముందుగానే స్పష్టం చేసింది. తాజా దాడులను ఉటంకిస్తూ మాస్కో వైపు నుంచి నిజమైన శాంతికి ప్రయత్నాలు లేవని అందువలన కొత్త ఆంక్షలు అమలు జరపాలని పారిస్‌ సమావేశానికి వెళ్లే ముందు జెలెన్‌స్కీ చెప్పాడు. ఉక్రెయిన్‌లో యుద్ధం ముగిసిన వెంటనే రష్యాతో పశ్చిమ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావటానికి దశాబ్దాలు పడుతుందని, ఎందుకంటే విశ్వాసం లేకపోవటమే అన్న నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే వ్యాఖ్య పరిస్థితి సంక్లిష్టతను వెల్లడిస్తున్నది. అలాంటి ఐరోపా దేశాలు అమెరికా మాటలను నమ్మి పుతిన్‌తో రాజీకి వస్తాయా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ పూర్వరంగంలో పారిస్‌ సమావేశం పరిస్థితిని సమీక్షించటం తప్ప వెంటనే నూతన కార్యాచరణను చేపట్టే అవకాశాలు పరిమితం.
ఇదిఇలా ఉండగా ఉక్రెయిన్‌ పోరులో రష్యా అతిపెద్ద భాగస్వామిగా ఉన్న చైనా వైఖరి మార్చుకుంటున్నట్లు కొంతమంది ఊహాగానాలతో మీడియా వార్తలను నింపుతున్నారు. భారత్‌, చైనా తటస్థంగా ఉన్నాయి తప్ప రష్యాకు మద్దతు ఇచ్చాయనటమే పెద్ద వక్రీకరణ. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అమెరికా-రష్యా రాజీపడి దగ్గరైతే ఐరోపా దేశాలు చైనాకు దగ్గర కావచ్చని గతంలోనే జోశ్యాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు పశ్చిమ దేశాల దళాలను నియోగించాలన్న ప్రతిపాదనకు చైనా మద్దతు తెలిపినట్లు చెప్పటానికి ఆధారాలేమిటో తెలియదు. ఈ సంక్షోభం త్వరగా పరిష్కారం కావాలని చైనా గతంలోనే బహిరంగంగా ప్రకటించింది తప్ప ఎవరికీ మద్దతు ఇవ్వలేదు, ఖండించనూ లేదు. అయితే పశ్చిమదేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది, అదే భారత్‌ కూడా చేసింది. శాంతి స్థాపక వ్యవహారాల చొరవలో తమ ప్రమేయం గురించి షీ జిన్‌పింగ్‌ వాకబు చేస్తున్నట్లు జర్మన్‌ పత్రిక ఒకటి రాసిన ఆధారం లేని వార్తను బట్టి చైనా వైఖరి మారుతున్నట్లు చిత్రిస్తున్నాయి. ఐరోపా వ్యవహారాల్లో చైనా ప్రమేయానికి అమెరికా అంగీకరిస్తుందా? దాని అనుయాయులుగా ఉన్న పశ్చిమ ఐరోపా ధనిక దేశాలు సరేనంటాయా? ఇప్పటికైతే ఊహాజనితమే, అదే జరిగితే ప్రపంచ రాజకీయ చిత్రపటమే మారిపోతుంది !

Spread the love