– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి
– ఆమనగల్ లో రైతులకు న్యాయ విజ్ఞాన అవగాహనా సదస్సు
నవతెలంగాణ-ఆమనగల్
వ్యవసాయ రంగంలో నెలకొనే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ విజ్ఞాన సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మెన్ శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఆమనగల్ పట్టణంలో ఉన్న రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న న్యాయ సలహా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ, న్యాయ శాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పని చేసి రైతులకు న్యాయం జరిగేలా చేయడమే వ్యవ సాయ న్యాయ సలహా కేంద్రాల ముఖ్య ఉద్దేశ మన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతుల భూ వివాదాలు ఇతర న్యాయ పరమైన సమస్యల పరిష్కారం కోసం ప్యారా లీగల్ వాలంటీర్లను నియమించినట్టు వారు చెప్పుకొచ్చారు. విత్తనాలు ఎరువులు పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు రైతులు రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలనీ, ఎవరికైనా నకిలీ విత్తనాలు అమ్మినా, మోసానికి పాల్పడిన న్యాయ సలహా కేంద్రంలో ఫిర్యాదు చేయాలని ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని, ఎటువంటి న్యాయ పరమైన సమస్యలు ఎదురైనా ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గీత, ఏడీఏ సుజాత, ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీకాంత్, ఎస్‌ఐ బాల్‌రామ్, ఎంపీఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ వసంత, పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, ఎంపీపీ అనిత విజరు, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వినోద్ కుమార్, మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి, ఏఈఓ రాణి, శివతేజ, సాయిరాం, మీనాక్షి, బాల్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.