– ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా?
– రూ.25 ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ప్రభుత్వం ఆదుకోదా?అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పది మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?అంటూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలదీశారు. తెలంగాణలో పదేండ్ల తర్వాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు- సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని పేర్కొన్నారు. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలను బలిపెట్టొద్దని కోరారు. గత పదేండ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేతరంగం.. ఇందిరమ్మ రాజ్యం పేరుతో తెచ్చిన ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చిన ఆర్నెళ్లలోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని తెలిపారు. నేతన్నల విషాదకరమైన పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో పరిష్కరించాలని సూచించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉపాది లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న నేతన్నలకు, నేత పరిశ్రమలకు భరోసా కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్రా, థ్రిప్ట్, యారన్ సబ్సిడీ, నేతన్న ఫించన్లు, నేతన్న బీమా, విద్యుత్ సబ్సిడీ మొదలైన పథకాలను కొనసాగిస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని తెలిపారు. లేకుంటే సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. నేత కార్మికులకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.