ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కమ్యూనిస్టుల ద్వారానే..

Alternative political power is through communists.– వర్గ పోరాటాలతోనే ప్రజాస్వామ్యం మనుగడ
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, జాన్‌వెస్లీ
నవతెలంగాణ – వనపర్తి
దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఒక్క కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్‌ బ్యాంకెట్‌ హాల్‌లో శనివారం సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. 50-60 ఏండ్ల కాలంలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలే కేంద్రంలో అధికారంలో ఉన్నాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలే రెండుసార్లు బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం కల్పించాయని చెప్పారు. భారతదేశంలో రాజకీయ, ఆర్థిక పరమైన విచ్ఛిన్నం జరగడం వల్లే దేశం ప్రగతి పథంలో ముందుకు సాగలేక పోతుందన్నారు. బీజేపీ పాలనలో అల్లరి మూకల చేష్టలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు రాజకీయంగా ఎదిగిన దేశాల్లో ప్రగతి.. జీడీపీ.. ఆర్థిక వ్యవస్థలు బలోపేతమై ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారాయని గత చరిత్రలు చెబుతున్నాయని అన్నారు. దేశంలో పదేండ్లుగా మోడీ ప్రభుత్వంలో కుల, మత పరమైన అంశాలను ప్రజల్లో జొప్పించి.. ఘర్షణలు, అరాచకాలు, అమానవీయ చర్యలను ప్రోత్సహించారని విమర్శించారు. లౌకికవాదాన్ని దెబ్బతీసేలా, ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పకూల్చేలా చేసిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ తీరని నష్టం చేసిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలంతా తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలతో ఏర్పడిన ఇండియా బ్లాక్‌కే అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపారని తెలిపారు. వర్గ పోరాటాల ద్వారానే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుందని, అందుకు కమ్యూనిస్టు వాదులంతా కంకణబద్ధులు కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని, వాటి పరిష్కారం కోసం బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీలేదని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలకు, సంపన్నులకు పన్నుల్లో రాయితీలు ఇవ్వడానికి తప్ప దేశ ప్రగతి కోసం, ప్రజల కోసం మోడీ చేసింది శూన్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జబ్బార్‌, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఆంజనేయులు, బాల్‌రెడ్డి, నాయకులు గోపి, డి.కుర్మయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love