– రాజ్యాంగ ప్రో రక్షణ యాత్రను విజయవంతం చేయాలి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంబేద్కరిజం ఆచరణతో,గాంధీ ఇజం ప్రచారం తో ప్రజాస్వామ్యం రక్షణ కవచం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జై బాపు,జై భీం,జై సంవిధాన్ అభియాన్ లో భాగంగా నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నియోజక వర్గంలో కార్యాచరణ రూపకల్పనకు మండల కమిటీ ఆద్వర్యంలో అద్యక్షులు తుమ్మ రాంబాబు అద్యక్షతన ఏర్పాటు చేసిన సమాయత్తం సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్లు గా దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ తన మాతృ సంస్థ ఆరెస్సెస్ రహస్య ఎజెండా అమలు చేస్తూ భారత జాతీయతా భావానికి తూట్లు పొడుస్తుంది అని,ఇందులో భాగంగానే మతం – దైవం తన కండ్ల సిద్దాంతాన్ని రెచ్చగొడుతూ రాజ్యాంగ స్పూర్తి విరుద్ధంగా మతాలు మధ్య చిచ్చు పెట్టి మోడీ తన ఉనికిని కాపాడు కుంటున్నాడు అని అన్నారు. సామాజిక సంక్షోభం సృష్టించి వారి మత భావాన్ని విస్త్రుత పరుచు కుంటున్న ఈ నేపధ్యం లో లౌకిక గణతంత్ర ప్రజాతంత్ర వ్యవస్థను కాపాడు కోవడం కోసం కాంగ్రెస్ జాతీయ స్థాయి విధాన నిర్ణయం అయిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా పరిగణించి ప్రతీ కార్యకర్త విజయవంతం పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జై బాపు,జై భీం,జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ఊరూరా గడప గడపకు తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. ప్రతీ కార్యకర్త భుజాన పార్టీ కండువా,చేతిలో జెండా పట్టుకుని ప్రజలకు చేరువ కావాలని అన్నారు.భుజం పై పార్టీ కండువా లేకుండా క్యాంప్ కార్యాలయానికి,ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం నియోజక వర్గం ఇంచార్జి డాక్టర్ రవి,నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,కానూరి మోహన్ రావు,రామ లక్ష్మయ్య,జూపల్లి ప్రమోద్,మిండ హరిక్రిష్ణ,కొల్లు చంద్రశేఖర్,కొనకళ్ళ చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.