– కాటాపూర్ స్థూపం వద్ద దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ – తాడ్వాయి
పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దిగి చిరంజీవి డిమాండ్ చేశారు. ఆదివారం కాటాపూర్ లో సీపీఐ(ఎం) సిఐటియు గిరిజన సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కాటాపూర్ సెంటర్ స్తూపం వద్ద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ.. పార్లమెంటులో రాజ్యాంగం అవిష్కరణ 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. భారత దేశంలో మతోన్మాద భావజాలాన్ని బిజెపి ప్రభుత్వం నాటాలని చూస్తుందని, అంబేద్కర్ ఒక్కరినీ విమర్శించినట్లు కాదని భారత దేశంలో ఉన్న ఆదివాసులు గిరిజనులు దళితులు బలహీన వర్గాల ప్రజలను మరి దేశ ప్రజలందరినీ రాజ్యాంగాన్ని కించ పరిషత్తుగా ఉందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని భారతదేశంలో లేకుండా చేయాలని చూస్తుందని, దీనికి బదులు మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చూస్తుందని అన్నారు. సిఐటియు మండల అధ్యక్షులు చిట్నేని శీను మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వ్యవస్థలకు సంబంధించి కులాలకు మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ను కించపరిచే విధంగా, రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన అమిత్‌షా తూలనాడడం సరైనది కాదన్నారు. కార్యక్రమంలో సి ఐ టి యు మండల అధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ కార్యదర్శి కాటా నర్సింగరావు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బంధెల విజయ్, గీత కార్మిక సంఘం నాయకులు గట్టు మల్లయ్య, నాయకులు మొత్తం సంజీవ మల్లికార్జున్ బుప్పారావు బాబు వైనాల రాజు తదితరులు పాల్గొన్నారు.