– అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా
– చెట్టుకిందే మధ్యాహ్న భోజన వంట
– మరో పాఠశాలలో ఒకే గదిలో ఐదు తరగతుల నిర్వహణ
– చెర్లకొండాపూర్ లో పూర్తికాని మరమ్మతులు
నవతెలంగాణ-రాయికల్: గత రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు మన ఊరు-మన బడి పథకం పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ,స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా విద్యార్థుల సంఖ్య నమోదు,హాజరు, కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి,విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై మన ఊరు-మన బడి పథకాన్ని రూపొందింస్తే,ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,స్వయం సహాయక సంఘాలు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మౌలిక సదుపాయాలు,టాయిలెట్లు,విద్యుత్,
నాణ్యమైన విద్య,మౌలిక సదుపాయాలు,బోధన,బోధనేతర అంశాలకు ప్రాధాన్యతనిస్తామని, భవిష్యత్తులో గొప్ప మానవ వనరులను సిద్ధం చేస్తాం, ఈ మార్పును జూన్ 12న చూపిస్తామని ఆయా శాఖల మంత్రులు సైతం వెల్లడించారు.
పథకం పేరు ఏదైనా ఏ ప్రభుత్వం అయినా మంచి ఉద్దేశ్యంతోనే ఆయా పథకాలను ప్రవేశ పెడుతున్న రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో గత ఐదేళ్లుగా తాళం వేసి ఉన్న ప్రాథమిక పాఠశాల(ఎస్.సి/సి)ను అమ్మ ఆదర్శ పాఠశాలగా ఎంపిక చేసి సుమారు 8 లక్షల 89 వేల రూపాయల అంచనా (జీఎస్టీతో) వ్యయంతో మరమ్మతులు చేశారు.నామికవస్తే మరమ్మతులు చేసి తాళం వేసి వదిలేయడంతో ఆ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందాన ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల జేబులు పాలవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మండల విద్యాధికారి ఎం.గంగాధర్ ను వివరణ కోరగా గతంలో ఆ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో గ్రామంలోని మరో ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయాలని గ్రామస్తులు కోరడంతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.కానీ ప్రస్తుతం ఆ ప్రాథమిక పాఠశాలలో సైతం మన ఊరు-మన బడి నిధులు నిలిచిపోవడం జరిగిందని,ఉపాధ్యాయులు బోధించేందుకు బ్లాక్ బోర్డులు సైతం లేకపోవడం,విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు కనీస సౌకర్యాలు లేక ఎండ కొడితే చెట్టు కింద వర్షం పడితే తరగతి గది ముందు పొయ్యి వెలిగించడం జరుగుతుందని,పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక మండలంలోని చెర్ల కొండాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాలగా ఎంపిక చేసినప్పటికీ తరగతి గదులు,మరుగుదొడ్లు,త్రాగు నీరు,వంట గది వంటి మరమ్మత్తు పనుల కోసం 12 లక్షల 6వేల అంచనా (జీఎస్టీతో) వ్యయంతో నెల రోజుల కింద పనులు చేపట్టిన పూర్తి కాకపోవడంతో ఒకే తరగతి గదిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే గదిలో పాఠాలు బోధిస్తున్నారు. మరమ్మత్తు పనులు జాప్యంతో విద్యార్థులకు సరైన తరగతి గదుల నిర్వహణ,మరుగుదొడ్ల లోపంతో గతంలో 53 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారని,పనులు నత్త నడకన కొనసాగడంతో హాజరు శాతం పడిపోయిందని సంబంధిత ఉపాధ్యాయులు వాపోయారు.పనులు నత్త నడకన కొనసాగడంపై నవతెలంగాణ ఇరిగేషన్ ఏ.ఈ ఆర్.వినయ్ కుమార్ ను వివరణ కోరగా మండలంలో 36 అమ్మ ఆదర్శ పాఠశాలలు ఎంపికవ్వగా 19 పాఠశాలలో మరమ్మత్తులు పూర్తి అయినవని,మిగిలిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి పనుల మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని,కూలీల కొరత వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు.