సాహితీ ఇన్‌ఫ్రాతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలున్నాయి?

– అక్రమాస్థుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వర్‌రావును విచారిస్తున్న ఏసీబీ అధికారులు
– నిందితుడిని మూడ్రోజుల పాటు కస్టడీలోకి దర్యాప్తు సంస్థ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
ఆదాయానికి మించి ఆస్థులు సంపాదించిన కేసులో అరెస్టయిన నగర సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మూడ్రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవలన ఉమామహేశ్వర్‌ ఆస్థులపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి, దాదాపు రూ.50 కోట్లకు పైగా అక్రమాస్థులను కలిగి ఉన్నట్టు తేల్చారు. అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించబడ్డ నిందితుడిని మరింతగా విచారించాల్సినవసరం ఉన్నదనీ, అందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. అయితే, మూడ్రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉమామహేశ్వర్‌రావును చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. అతనిని బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ప్రధానంగా, ఉమామహేశ్వర్‌రావును ఇన్ని కోట్ల రూపాయల ఆస్థులను ఏ విధంగా సంపాదించారు మొదలుకొని అందుకు అనుసరించిన మార్గాల పైనా ఏసీబీ అధికారులు నిందితుడిని ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా, తాను విచారణ జరిపిన సాహితి ఇన్‌ఫ్రా సంస్థ నుంచి ఏ మేరకు ముడుపులను వసూలు చేశారనే కోణంలో నిందితుడిని నిలదీసినట్టు తెలిసింది. లేని భూమిని ఉన్నట్టుగా చూపించి, డిపాజిటర్ల నుంచి రూ.1500 కోట్ల మేరకు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాహితి ఇన్‌ఫ్రా కేసులో సవ్యంగా విచారణ జరపనందుకుగానూ ఉమామహేశ్వర్‌రావుకు భారీ మొత్తంలో ముడుపులు అందాయనీ ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన నిజాలను వెలికి తీసే దిశగా ఏసీబీ అధికారుల దర్యాప్తు సాగుతున్నట్టు తెలిసింది.

Spread the love