గ్రామసభల ద్వారా పోడు సాగుదార్ల దరఖాస్తుల ఆమోదం తీసుకోవాలి

– కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని, ఆరు గ్యారెంటీ దరఖాస్తు ఫారంలో చేర్చాలి
– టీఏజీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
పోడు సాగుదార్ల దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఆమోదం తీసుకోవాలని, కొత్తరేషన్‌ కార్డులు ఇవ్వాలని ఆరు గ్యారెంటీ దరఖాస్తు ఫారంలో చేర్చాలని టీఏజీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు డిమాండ్‌ చేశారు. ఆదివారం భద్రాచలం పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సున్నం గంగా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసైన్మెంట్‌ భూముల గత అనేక సంవత్సరాల నుండి సాగు చేస్తున్న ఆదివాసీలందరికీ పట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్‌ పోస్టులను భర్తీ చేసే విధంగా నూతన ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలన్నారు. మొన్న వచ్చిన భారీ వర్షాల కారణం వల్లన పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే భవిష్యత్తులో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రవికుమార్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గౌరి నాగేశ్వరరావు, మడివి రమేష్‌, సోయం జోగారావు, పాయం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love