గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

– అసైన్డ్, అగ్రికల్చర్ భూముల్లోనూ నిర్మాణాలు
– చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.పలుసార్లు అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలని,నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని చెబుతున్న ఉన్నతాధికారుల మాటలు వట్టి మాటలుగానే కొట్టి పడేస్తున్నారు గ్రామస్థాయి అధికారులు. మండలంలోని చింతలూరు గ్రామ శివారులోని  ఓ వ్యవసాయ భూమిలో కమర్షియల్ భవన నిర్మాణం జరుగుతున్న అధికారుల చూపు మాత్రం ఆ వైపు పడటం లేదు.నాలా కన్వర్షన్ లేకుండా, పంచాయితీ అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం జరుగుతున్న స్థానిక అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఒడ్డె లింగాపూర్ గ్రామ శివారులో ఓ అక్రమ నిర్మాణానికి  పంచాయితీ కార్యదర్శి నోటీసులు జారీ చేసినప్పటికీ అనుమతులు తీసుకోకుండానే భవన నిర్మాణం చేయడం, భూపతిపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 58 లో అసైన్డ్  ల్యాండ్ లో సైతం పక్కాగా ఎలాంటి అనుమతులు లేకుండా  కమర్షియల్ భవన నిర్మాణం జరిగిన అధికారులు పట్టించుకోకపోవడం పై ముడుపులు చెల్లిస్తే ఎక్కడైనా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేసుకోవచ్చు అనే చర్చ ఆయా గ్రామాల్లో  జోరుగా వినిపిస్తుంది. చింతలూరు శివారులో గల వ్యవసాయ భూమిలోని అక్రమ నిర్మాణం గురించి  నవతెలంగాణ  పంచాయితీ కార్యదర్శి వినోద్ ను వివరణ కోరగా.. గ్రామ పంచాయితీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని,నాలా కన్వర్షన్ కోసం సంబంధిత రైతు దరఖాస్తు చేసుకున్నారని  తెలిపారు.
ఒడ్డెలింగాపూర్ శివారులో గల నిర్మాణం గురించి పంచాయితీ కార్యదర్శి కవిత ను వివరణ కోరగా నోటీసులు జారీ చేశామని తెలిపారు.భూపతిపూర్ గ్రామ శివారులోని అసైన్డ్ భూమిలో గల నిర్మాణం గురించి పంచాయితీ కార్యదర్శి హరి కృష్ణ ను వివరణ కోరగా నోటీసులు జారీ చేశామని,అసైన్డ్ భూమి రెవెన్యూ పరిధిలో ఉంటుందని గ్రామ సరిహద్దులు నిర్ణయించక పోవడంతో అట్టి నిర్మాణం, సర్వే నెంబర్ ఏ గ్రామానికి చెందినదనే విషయంపై  రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోకపోవడం తో నిబంధనలు పాటించకుండా  గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ భవన నిర్మాణాలు యథేచ్ఛగా నిర్మించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాజీ ప్రజాప్రతినిధులు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.ఇప్పటికైనా టాస్క్‌ఫోర్స్‌, సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లోని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Spread the love