రేపు తొలి విమానం ప్రారంభం
హైదరాబాద్ నుంచి 9,460 మంది ప్రయాణం
తెలంగాణ నుంచి 6,500 మంది
ఆంధ్రప్రదేశ్ నుంచి 1,100 మంది
పెంచిన రూ.10వేలు మాఫీ చేయాలని కేంద్రానికి లేఖ
ఆర్థికస్థోమత ఉన్నవారు చెల్లించాలని హజ్ కమిటీ చైర్మెన్ ఖుస్రోపాషా విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హజ్‌యాత్రకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలంగాణ హజ్ కమిటీ చైర్మెన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియాబని ఖుస్రోపాషా తెలిపారు. ఈనెల 4 వతేదీ తొలి బృందం యాత్రకు బయల్దేరి వెళ్తుందని చెప్పారు. యాత్రీకులు తప్పనిసరిగా హజ్ హౌస్‌కు వచ్చి ట్రాకింగ్ వాచ్‌ట్యాగ్ కట్టించుకోవాల్సి ఉంటుందన్నారు. శనివారంనాడిక్కడి హజ్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి 150 మంది హజ్ యాత్రీకులకు సహాయకులుగా ప్రభుత్వం తరఫున ఓ ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారిని నియమించామనీ, వారు హజ్ ప్రయాణం మొదలు, అది పూర్తయ్యి తిరిగి గమ్యస్థానాలకు చేరేవరకు యాత్రీకుల వెంటే ఉంటారని వివరించారు. రాష్ట్రం నుంచి 6,500 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,100 మంది యాత్రీకులు హజ్‌కు వెళ్తున్నారని చెప్పారు. హజ్‌యాత్రీకులపై కేంద్ర ప్రభుత్వం విధించిన అదనపు చార్జీ రూ.10వేలను మాఫీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాసామన్నారు. అక్కడి నుంచి రిప్లరు రావడం ఆలస్యం అవుతున్నందున ఆర్థికస్థోమత ఉన్న ప్రయాణీకులు ఆ చార్జీని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అది సాధ్యం కానివారికి ప్రత్యామ్నాయమార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా సౌదీ ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని కఠినతరం చేసిందనీ, వాటిని యాత్రీకులు గమనించాలని కోరారు. గతంలో హజ్ యాత్ర సందర్భంగా యాత్రీకులు అక్కడే వంట చేసుకొనేవారనీ, ఇప్పుడు అలా బహిరంగంగా వంట చేయడాన్ని నిషేధించారని తెలిపారు. గతంలో భార్యాభర్తలు హజ్‌యాత్రలో ఉంటే, ఒకే గది కేటాయించేవారనీ, ఇప్పుడు పురుషులు, మహిళలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేశారని వివరించారు. సౌదీ ప్రభుత్వ ఉత్తర్వులను హజ్‌యాత్రీకులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హజ్‌యాత్రకు ఏర్పాట్లు పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



