– తుఫాన్‌తో బార్బడోస్ విమానాశ్రయం మూసివేత
– హోటల్ గదులకే పరిమితమైన భారత క్రికెటర్లు
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్) : ప్రపంచకప్ విజయోత్సవాలు, ఆటగాళ్ల భావోద్వేగపూరిత దృశ్యాలు, భారత క్రికెటర్ల గెలుపు ధమాకా వంటి ఫోటోలు అభిమానులను కేరింతలు కొట్టించగా.. బార్బడోస్ నుంచి ఆదివారం సాయంత్రం నుంచి కలవర పాటుకు గురిచేసే వార్తలు, ఫోటోలు రావటం మొదలైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయానందంలో మునిగిపోయిన టీమ్ ఇండియా క్రికెటర్లు.. షెడ్యూల్ సమయానికి స్వదేశానికి రాలేకపోతున్నారు. ఆదివారం ఉదయమే దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఇంటిముఖం పట్టగా.. భారత క్రికెటర్లు సాయంత్రం ప్రత్యేక విమానంలో నేరుగా ముంబయికి చేరుకోవాల్సి ఉంది. కానీ బార్బడోస్‌కు సౌత్‌ఈస్ట్‌కు 125 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్ర బిందువు ఉండటంతో.. అక్కడి విమానాశ్రయంతో పాటు స్థానిక దుకాణాలు, షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా బంద్ చేశారు. సోమవారం అర్థరాత్రి వరకు తుఫాన్ (కేటగిరీ 3 తుఫాన్) బార్బడోస్‌ను దాటి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాతే విమానయాన సర్వీస్‌లు మొదలు కానున్నాయి. భారత క్రికెటర్లు అక్కడి హిల్టన్ హోటల్‌లో ఉండగా.. తగినంత మంది సిబ్బంది సైతం అందుబాటులో లేరని సమాచారం. ప్రపంచకప్ కవరేజీ కోసం కరీబియన్ దీవులకు వెళ్లిన భారత క్రీడా పాత్రికేయులు సైతం అక్కడే చిక్కుకున్నారు. మంగళవారం మధ్యాహ్నాం తర్వాత భారత క్రికెటర్ల ప్రయాణంపై ఓ స్పష్టత రానుంది. ‘ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్ విజయం సాధించిన భారత జట్టుకు స్వదేశంలో భారీ స్థాయిలో సన్మానం చేసేందుకు ప్లాన్ చేశాం. ఇక్కడ క్రికెటర్లు తుఫాన్ కారణంగా హోటల్‌కు పరిమితమయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టును స్వదేశం చేర్చటంపైనే బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత క్రికెటర్లకు సన్మానంపై ఆలోచన చేస్తామని’ బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.