
– అందె లో కళాకారులకు సన్మానం
నవతెలంగాణ – మిరు దొడ్డి
మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో సుమారు 65 మంది కళాకారులకు సామాజిక సమరసత ఆధ్వర్యంలో సన్మానం చేశారు. రామాయణం, మహాభారతం, భాగవతం వివిధ పౌరాణిక ఇతివృత్తంతో కథలు నాటకాలు భజనలతో సమాజంలో జాగృతి తీసుకువచ్చేందుకు వారు చేసిన కృషి అభినందనీయమని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సన్మాన గ్రహీతలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా తడకపల్లి ఆవాస విద్యార్థులు మరియు స్థానిక హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథిగా జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికురాలు నారాయణమ్మ విచ్చేశారు. హిందూ ధర్మం పట్ల పద్యాలు, కథ గానంతో నారాయణమ్మ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఐక్యత ఉంటేనే ఏదైనా సాధ్యమని కులం ప్రజల మధ్య అడ్డుగోడగా కాకుండా, జీవన విధానంలో సహకారం అందించేలా తోడ్పాటు అందించాలని సూచించారు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నరేష్ బాబు జిల్లా కార్యదర్శి సంతోష్ ,సుమన్, పోచయ్య పరశురాములు, సంతోష్, మహేష్ పలువురు పాల్గొన్నారు.