అర్ష్‌దీప్, సిరాజ్, అక్షర్ మ్యాజిక్
ఆఖరు వన్డేలో భారత్ అద్భుత విజయం
3-1తో వన్డే సిరీస్ టీమ్ ఇండియా వశం
మౌంట్ మాంగనుయ్
ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ టీమ్ ఇండియా సొంతమైంది. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాకు మెరుపు విజయాన్ని కట్టబెట్టారు. బ్యాట్‌తో తొలుత చెరో 14 పరుగులు చేసిన అర్ష్‌దీప్, సిరాజ్‌లు.. అనంతరం బంతితో సమిష్టిగా 5 వికెట్లు పడగొట్టారు. ఫలితంగా, ఆఖరు వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 22 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. 210 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31, 42 బంతుల్లో 5 ఫోర్లు), నిక్ కెల్లీ (24, 45 బంతుల్లో 2 ఫోర్లు), మిచెల్ శాంట్నర్ (24, 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఛేదనలో పోరాడినా..
భారత బౌలర్లు నిలకడగా వికెట్లు పడగొట్టారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (46, 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (46, 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) విలువైన ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన అర్ష్‌దీప్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. యువ పేసర్ గుర్నూర్ బరార్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-1తో గెల్చుకుంది. భారత్, న్యూజిలాండ్ వైట్‌బాల్ ఫార్మాట్ పోరు ముగియగా.. గురువారం నుంచి టెస్టు సిరీస్ షురూ కానుంది.
ఆ ఇద్దరు మెరువగా
కీలక టాస్ ఓడినా, భారత్ తొలుత బ్యాట్ పట్టింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లి (5) మరోసారి నిరాశపరిచారు. రుతురాజ్ గైక్వాడ్ (18, 27 బంతుల్లో 3 ఫోర్లు) మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దీంతో భారత్ పవర్‌ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22, 26 బంతుల్లో 3 ఫోర్లు) ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా.. ఎంతోసేపు వికెట్ కాపాడుకోలేదు. అక్షర్ పటేల్ (46) కలిసి నాల్గో వికెట్‌కు 52 పరుగులు జోడించిన అయ్యర్‌ను టిక్‌నర్ సాగనంపాడు. అప్పటికి భారత్ స్కోరు 86/4. ఈ సమయంలో అక్షర్ పటేల్‌తో జతకట్టిన ఇషాన్ కిషన్ (46) విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. అర్థ సెంచరీ ముంగిట అక్షర్ అవుటైనా..
నమన్‌ధీర్ (22)తో కలిసి ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. అకిబ్ నబి, యశ్ ఠాకూర్ నిష్క్రమించినా.. మహ్మద్ సిరాజ్ (14 నాటౌట్)తో కలిసి 17 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ ముంగిట ఇషాన్ సైతం వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 183/9. ఆఖరు వికెట్‌కు సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ (14)లు 10 బంతుల్లోనే 26 పరుగులు జోడించారు. అక్షర్ రెండు సిక్సర్లు కొట్టగా.. సిరాజ్ ఓ సిక్సర్, ఫోర్‌తో మెరిశాడు. దీంతో భారత్ 209 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ (3/60), మాథ్యూ షిఫర్ (2/28), మిచెల్ శాంట్నర్ (3/47) రాణించారు.
బౌలర్లు కలిసికట్టుగా..
209 పరుగులను కాపాడుకునేందుకు భారత బౌలర్లు సమిష్టిగా విజృంభించారు. కివీస్‌ను నిలకడగా ఒత్తిడి పెంచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 35 ఓవర్ల వరకు స్పిన్నర్‌కు బంతి ఇవ్వలేదు. విల్ యంగ్ (22), నిక్ కెల్లీ (24), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా భారత పేసర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. సిరీస్‌లో తొలిసారి ఆడిన మహ్మద్ సిరాజ్ వికెట్ల వేట షురూ చేయగా.. అర్ష్‌దీప్ సింగ్, అకిబ్ నబి , యశ్ ఠాకూర్ కొనసాగించారు. అక్షర్ పటేల్, నమన్ ధీర్‌లు సైతం సమిష్టిగా 3 వికెట్లు పడగొట్టి కివీస్‌ను కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో సీమ్, స్వింగ్ ఎటాక్‌ను కొనసాగించిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తనేంటో చూపించాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : 209/10 (ఇషాన్ కిషన్ 46, అక్షర్ పటేల్ 46, నమన్ ధీర్ 22, శ్రేయస్ అయ్యర్ 22, జాకబ్ డఫ్ఫీ 3/60, మిచెల్ శాంట్నర్ 3/47, మాథ్యూ ఫిషర్ 2/28)
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 187/10 (డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 31, నిక్ కెల్లీ 24, మిచెల్ శాంట్నర్ 24, విల్ యంగ్ 22, అర్ష్‌దీప్ సింగ్ 3/30, మహ్మద్ సిరాజ్ 2/50, అక్షర్ పటేల్ 2/28)







కామెంట్‌లు (0)