మూడో వన్డేకూ వర్షం ముప్పు
భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే నేడు
ఉదయం 7.30 నుంచి
సోనీ నెట్‌వర్క్‌లో..
సొంతగడ్డపై న్యూజిలాండ్ చివరగా 2019లో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో న్యూజిలాండ్‌కు ఎదురులేదు. సొంతగడ్డపై వన్డేల్లో కోట కట్టిన కివీస్‌కు భారత్ మరోసారి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మూడో వన్డేలోనే సొంతం చేసుకునేందుకు టీమ్ ఇండియా ఎదురుచూస్తోంది. ఓ వైపు వరుణుడు ముచ్చటగా మూడో వన్డేకు అంతరాయం కలిగించేందుకు రంగం సిద్ధం చేసుకోగా.. సొంతగడ్డపై రికార్డును కాపాడుకునేందుకు న్యూజిలాండ్ అన్ని అస్ర్తాలు సంధించేందుకు సై అంటోంది. భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే నేడు.
హామిల్టన్ (న్యూజిలాండ్)
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను వరుణుడు వదలట్లేదు. సహజంగా నవంబర్‌లో న్యూజిలాండ్‌లో ఎక్కువగా వర్షాలు ఉండవు. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నిలకడగా వర్షాలు కురుస్తుండగా పిచ్ సిద్ధం చేసేందుకు సిబ్బందికి ఒక్క రోజు సమయం కూడా లభించలేదని హామిల్టన్ క్యూరేటర్ వాపోయాడు. ఓ వైపు వర్షాలతో భారత్ ఇండోర్‌లో ప్రాక్టీస్ చేయగా, పిచ్ సైతం షెడ్యూల్ ప్రకారం తయారు కాలేదు. మ్యాచ్ రోజు సైతం రోజంతా వర్షం సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే సమరానికి రెఢీ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా మరోసారి టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోనుంది.
గిల్‌కు సవాల్!
వర్షం ప్రభావిత పిచ్ పేస్‌కు స్వర్గధామంగా మారాయి. కైల్ జెమీసన్ ఓవర్లో శుభ్‌మన్ గిల్ ఎడ్జ్‌తో క్యాచౌట్‌గా సున్నా పరుగులకే నిష్క్రమించాడు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధం అయ్యేందుకు శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ తర్వాత జట్టును వీడనున్నాడు. టెస్టు సిరీస్‌లో జెమీసన్‌ను ఎదుర్కొనేందుకు ఇక్కడే దీటుగా బదులివ్వాలనే తపన శుభ్‌మన్‌లో కనిపిస్తోంది. పదునైన పేస్, అదనపు బౌన్స్‌తో బ్యాటర్లకు ఇక్కడ పరుగుల వేట గగనమైంది. శుభ్‌మన్ గిల్‌కు తోడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పరుగులు చేసేందుకు ఇష్డపడతారు. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో నిలబడుతూ జట్టును నిలబెడుతున్నారు. నమన్ ధీర్, అక్షర్ పటేల్ బ్యాట్‌తో మెప్పించాల్సి ఉంది. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. యువ పేసర్లు అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబి మరోసారి తుది జట్టులో నిలిచే వీలుంది. అర్ష్‌దీప్ సింగ్ పేస్ దళానికి సారథ్యం వహించనున్నాడు.
ప్రమాదంలో రికార్డు!
న్యూజిలాండ్‌కు ఓవైపు ఓటములతో పాటు గాయాలు సైతం వేధిస్తున్నాయి. డెవాన్ కాన్వే, మాట్ హెన్రీలు కంకషన్‌తో దూరం కాగా.. తాజాగా బ్లెయిర్ టిక్‌నర్ సైతం కంకషన్‌కు గురయ్యాడు. విల్ యంగ్, టిమ్ సీఫర్ట్, హెన్రీ నికోల్స్‌తో పాటు టామ్ లేథమ్‌లు జట్టుకు భారంగా మారుతున్నారు. హామిల్టన్‌లో ఈ నలుగురిలో ఎవరు మెరిసినా, ఆతిథ్య జట్టుకు కొంత ఊరటే. బ్యాటింగ్ భారం మరోసారి డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మోయనుండగా.. కైల్ జెమీసన్, ఫిషర్, శాంట్నర్‌లు బంతితో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అక్షర్ పటేల్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబి, గుర్నూర్ బరార్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ : విల్ యంగ్, టిమ్ సీఫర్ట్, హెన్రీ నికోల్స్, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జెమీసన్, మాట్ ఫిషర్, జాకబ్ డఫ్ఫీ.







కామెంట్‌లు (0)