సిరియాపై దురాక్రమణకు యత్నం

Attempted invasion of Syria– ఇజ్రాయిల్‌ బరితెగింపు
– 48గంటల్లో 250కి పైగా వైమానిక దాడులు
– గొలాన్‌ హైట్స్‌ బఫర్‌ జోన్‌లోకి ఇజ్రాయిల్‌ చొరబాటు
– ఖండించిన అరబ్‌ ప్రపంచం
– రాజీనామా అసద్‌ స్వంత నిర్ణయమేనన్న మాస్కో
డమాస్కస్‌ : తిరుగుబాటు అనంతరం సిరియాలో నెలకొన్న అనిశ్చితిని ఆసరా చేసుకుని ఇజ్రాయిల్‌ ఆ దేశంపై దురాక్రమణపూరిత దాడులకు పూనుకుంది. సిరియాకు చెందిన గొలాన్‌ హైట్స్‌ బఫర్‌ జోన్‌ను కబళించేందుకు ఇజ్రాయిల్‌ సైన్యం ఆ ప్రాంతంలోకి చొరబడింది. రసాయనిక ఆయుధాలు ఉన్నాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గొలాన్‌ హైట్స్‌ పై పెద్దయెత్తున వైమానిక దాడులకు పాల్పడుతోంది. సిరియా నౌకలను, మిలటరీ గోదాములను ధ్వంసం చేసింది. రాజధాని డమాస్కస్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశోధనా కేంద్రాలు, మిలటరీ ప్రాంతాలపై కూడా దాడులు చేస్తోంది.
అసద్‌ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఇజ్రాయిల్‌, గోలన్‌ హైట్స్‌పై దండెత్తింది.గడచిన 48గంటల్లో దాదాపు 250 వైమానిక దాడులు జరిపినట్లు ఎస్‌ఓహెచ్‌ఆర్‌ తెలిపింది. ఇది పరిమితమైన, తాత్కాలిక చర్యగా ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.
ఖండించిన అరబ్‌ దేశాలు
సిరియా గోలన్‌ హైట్స్‌లోని నిస్సైనికీకరణ మండలాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్‌ చర్యలను అరబ్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులు, 1974 నాటి ఒప్పందాన్ని దారుణంగా ఉల్లంఘించడమేనని ఈజిప్ట్‌ విమర్శించింది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా సిరియా ప్రాదేశిక సమగ్రతను దారుణంగా డెబ్బతీశారని పేర్కొంది. ఈ దాడులపై తక్షణమే నిర్దిష్ట వైఖరి తీసుకోవాలని భద్రతా మండలిని కోరింది. సిరియాలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు గల అవకాశాలను దెబ్బతీసేలా ఇజ్రాయిల్‌ దాడులు ఉన్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. ఇదొక ప్రమాదకరమైన పరిణామమని కతార్‌ విమర్శించింది.
ఇజ్రాయిల్‌ దురాక్రమణ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్‌ అనుసరించే ఇటువంటి విధానాల వల్ల ఈ ప్రాంతంలో మరింత హింస పెచ్చరిల్లుతుందని హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను, అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయిల్‌ బాహాటంగా ఉల్లంఘిస్తోందని కువైట్‌ విమర్శించింది. సిరియాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణ తమకెంత మాత్రమూ సమ్మతం కాదని జోర్డాన్‌ పేర్కొంది.
గొలాన్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలతో కూడిన బఫర్‌ జోన్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని ఇరాక్‌ ఖండించింది. దురాక్రమణదారు ఇజ్రాయిల్‌ చర్యలను అరబ్‌ లీగ్‌ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.
రాజీనామా ఆయన స్వంత నిర్ణయమే : క్రెమ్లిన్‌
పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయం అసద్‌ స్వంతమేనని అందులో రష్యా పాత్ర ఏమీ లేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ చెప్పారు. శని, ఆదివారాల్లో సిరియాలో తిరుగుబాటు దళాలు దేశంలోని కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవడంతో అసద్‌ అధికారికంగా రాజీనామా చేసి కుటుంబంతో కలిసి మాస్కో వచ్చేశారు. రష్యాలో అసద్‌కు ఆశ్రయం కల్పించామని ఇప్పటికే మాస్కో ప్రకటించింది. అసద్‌ ఈ నిర్ణయం తీసుకునేలా మాస్కో ప్రభావితం చేసిందా అని విలేకర్లు ప్రశ్నించగా, దానికి పెస్కోవ్‌ పై విధంగా స్పందించారు.

Spread the love