భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాలి

– విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకోండి
– ప్రజలను అప్రమత్తం చేయాలి
– సాగునీటిపారుదల అధికారులకు : ఈఎన్సీ అనిల్‌ కుమార్‌ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్షాలు కురవనున్నాయంటూ హైదరాబాద్‌ వాతావరణ శాఖ(రెడ్‌-టెక్‌-యాక్షన్‌) చేసిన సూచనలతో తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖా అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ జనరల్‌ బి అనిల్‌కుమార్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖాధికారులతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అలాగే ఫోన్లద్వారా శుక్రవారం ఈఎన్సీలు, సీఈ, యస్‌ఈ, ఈఈలతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. రిజర్వాయర్లు,కాలువలు, నదులలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలనీ, ఆ సమాచారాన్ని వేగంగా రాష్ట్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. స్పిల్‌ వేలు, వరదగేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదో గమనించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ బందాలతో సమన్వయం చేసుకుంటూనే భద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

Spread the love