Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాల్సా పథకాలపై అవగాహన కల్పించాలి

నాల్సా పథకాలపై అవగాహన కల్పించాలి

- Advertisement -

– ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు సెన్సిటైజేషన్ కార్యక్రమం
నవతెలంగాణ – కామారెడ్డి
: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు హాల్‌లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు నాల్సా పథకాలపై సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో నాల్సా పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళలు, బాలల కోసం అమలు చేస్తున్న నాల్సా మహిళా-బాలల సంరక్షణ పథకం ద్వారా గృహ హింస, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో కేసుల బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కార్మికులు, ఖైదీలు, వృద్ధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ నాల్సా పథకాల గురించి వివరించారు.

బాధితులకు ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం, లోక్ అదాలత్‌ల ద్వారా వేగవంతమైన న్యాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు న్యాయ అవగాహన కల్పించి, అర్హులైన వారిని గుర్తించి న్యాయ సహాయం అందించేందుకు పారా లీగల్ వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు.

ప్రజలు కోర్టులకు వెళ్లకుండానే సఖ్యతతో వివాదాలను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌లు ఉత్తమ వేదిక అని తెలిపారు. ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకొని న్యాయ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సిద్ధరాములు, ఎం.ఎ. ఖలీల్, భాస్కర్, అహ్మద్, మొగులయ్య తదితరులు, పారా లీగల్ వాలంటీర్లు పుష్పవతి, స్వర్ణలత, రామకృష్ణ రెడ్డి, విజయ్, సురేష్ ఉదత్వార్, అలీమొద్దీన్, ఖలీల్ ఉల్లాహ్ తదితరులు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -