నైతిక బోధనలకే బాబాలను పరిమితం చేయాలి

– వారి ఆస్తుల లెక్క తేల్చాలి
– ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారాలా? : మానవ వికాస వేదిక అధ్యక్షులు బి.సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో బాబాలను నైతిక బోధనలకే పరిమితం చేయాలని మానవ వికాస వేదిక అధ్యక్షులు బి.సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఆదాయ పన్ను శాఖ ద్వారా వారి ఆస్తుల లెక్క తేల్చాలని కోరారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని తెలిపారు. ఆధ్యాత్మికత, సంస్కృతి రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. హత్రాస్‌ దురంతం నేపథ్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘మూఢ నమ్మకాల నిరోధక చట్టం ఆవశ్యకత’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ఈ వెబినార్‌లో సాంబశివరావుతో పాటు విజ్ఞానదర్శిని అధ్యక్షులు టి.రమేశ్‌ మాట్లాడారు. ఎస్వీకే కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయం చేశారు. సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో రకరకాల మూఢ నమ్మకాలు ప్రజలను బాధితులుగా మారుస్తున్నాయని తెలిపారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం ప్రతి ఏటా వేలాది మంది బాధితులవుతున్నారని చెప్పారు. కేంద్రంలో మూఢ నమ్మకాల చట్టం తెచ్చి బాబాలు, స్వామీజీలపై నియంత్రణ పెట్టాల్సిన అవసరముందని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల స్థాయిల్లోనూ మూఢ నమ్మకాలను ప్రోత్సహించేలా కోర్సులను ప్రవేశపెడుతోందని విమర్శించారు. రమేశ్‌ మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఒకట్రెండు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలున్నాయని తెలిపారు. మొత్తం మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సమగ్రంగా చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రలో మూఢ నమ్మకాల నిరోధక చట్టం తెచ్చినట్టుగా తెలంగాణలోనూ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని మూఢ నమ్మకాల నిరోధక చట్టం సాధన సమితి ద్వారా కలువనున్నట్టు తెలిపారు. మతాల పేరుతో జరుగుతున్న మోసాలపై పోరాడుతున్న హేతువాదులు, నాస్తికులతో ఆయా మతాల్లో ఉన్న భక్తులు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love