– సైబర్ మోసాల కట్టడిపై దృష్టి పెట్టాలి : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
– ప్రధానీ, ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు
– ఆరేండ్ల తర్వాత విరమణ
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా ఆరేండ్ల పూర్తి చేసిన శక్తికాంత దాస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. చివరి రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం, వృద్ధి, సైబర్ మోసాలు ఆర్బీఐ ముందున్న ప్రధాన సవాళ్లని అన్నారు. సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త సాంకేతికతలను ఉపయోగించడంపై దృష్టి సారించాలని సూచించారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యతను పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. నాలుగేండ్లలో అత్యంత వేగంగా కూరగాయల ధరలు పెరగడంతో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 6.21 శాతానికి చేరి 14నెలల గరిష్ఠ స్థాయి వద్ద నమోదయ్యిందని గుర్తు చేశారు. పదవీ విరమణ సందర్బంగా ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎక్స్‌లో శక్తికాంత ధన్యవాదాలు తెలిపారు. ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీ మార్గదర్శకం, ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్బీఐల మధ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందన్నారు. అసాధారణమైన పరిస్థితులను ఎంతో విజయ వంతంగా ఎదుర్కొన్నామన్నారు. విశ్వాసం, విశ్వసనీయత సంస్థగా ఆర్బీఐ ఎదగాలని ఆకాంక్షించారు. నూతన గవర్నర్‌గా బాధ్యతలు చేపట ్టనున్న సంజరు మల్హోత్రా అపారమైన అనుభవం కలిగి ఉన్నారన్నారు. ఆర్బీఐ కార్యకలాపాలను సమర్థవంగా నడిపించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.