యూనివర్సిటీ లోఅంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు..

నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గూనుగు, తంగేడు, బంతి, పోకబంతి, కట్ల, గుమ్మాడి, చామంతి, టేక్ పువ్వులతో ఎంతో బతుకమ్మలను పేర్చి ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళా విభాగం అధ్వర్యంలో నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాలకు విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి పాల్గొని బతుకమ్మలకు, వెంపల్ చెట్టుకు, తులసి చెట్టుకు పూజ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ పండుగ ప్రఖ్యాతి గాంచిందన్నారు. విశ్వవ్యాప్తంగా ఈ పూల పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటూ జాతి సంస్కృతికిని ఇనుమడింపజేస్తున్నారని పేర్కొన్నారు .బతుకమ్మ పండుగను అనాది కాలంగా నిర్వహిస్తూ వారసత్వ విలువలను ఒక తరం నుంచి మరొక తరానికి క్రమంగా అందిపుచ్చుకుంటున్నారని వివరించారు. 12 వ శతాబ్దం అనంతరం తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన శైవ, వైష్ణవ సిద్ధాంతాలకు అనుగుణంగా బతుకమ్మకు సంబందించిన పుట్టుపూర్వోత్తరాల చరిత్రను ఐతిహ్యాలుగా జన బాహుళ్యంలో స్థిరపడ్డాయని అన్నారు. మనం పాడుకునే బతుకమ్మ పాటలో ఈ చరిత్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అదే విధంగా కాకతీయుల పాలనా కాలం నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమైదనే అధారాలు ఉనాయన్నారు. కాకతీయ రాజులు దశబంధ చెరువులు తవ్వించిన సందర్భంలో చెరువులన్ని నిండి, పంట పొలాలు సస్యశ్యామలం అయ్యయన్నారు. సుభిక్షం, సౌభాగ్యం వెల్లివిరియడంతో ప్రజలందరు ఆనందోత్సాహాలతో పూలను అందంగా పేర్చి చెరువులకు అర్పించారనే గాథను ప్రస్తావించారు. బతుకమ్మ పండుగ జాతి సమైక్యతను కూడా చాటి చెబుతుందని, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఉద్యమానికి ఊపిరిని అందించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ ఒక అంత:స్సూత్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ పుష్పంగా తంగేడును ఎంచుకోవడం మన జాతి ఔన్నత్యానికి సూచిక అన్నారు. బతుకమ్మ పండుగ ఇంటిల్లిపాది చేసుకునే పండుగ అన్నారు. కుటుంబ మానవ సంబంధాలను, అన్నా చెల్లెండ్ల ఆత్మీయ అనుబంధాలను పెంపొందింపజేస్తుందన్నారు. అనేక బతుకమ్మ పాటల్లో ఈ నేపథ్యం కనిపిస్తుందని అన్నారు. ప్రకృతి పరవశంగా విరబూసిన కాలంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితిగా వస్తుందన్నారు. స్త్రీలకు ప్రకృతితో అనుబంధం ఎక్కువ అన్నారు. ప్రకృతిలో పుష్పించిన పువ్వులను బతుకమ్మలను పేర్చడం వల్ల వారిలో మానసిక వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు. పసుపు కుంకుమలతో తొమ్మిది రోజులు వాయినాలు ఇచ్చుకోవడంలో ఆరోగ్యపరమైన సూత్రాలు కూడా ఉన్నయని నిపుణులు తేల్చారని అన్నారు. బతుకమ్మకు అర్పించే వివిధ రకాల ప్రసాదాలు బలవర్దకమైవని అన్నారు. ఇటువంటి పండుగను విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం వల్ల విద్యార్థులకు విజ్ఞానంతో పాటుగా సాంస్కృతిక వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని అన్నారు. ఈ పండుగను జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ఉపకులపతి శ్రీమతి వాకాటి కరుణ సీనియర్ ఐ ఎ ఎస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్. ఆరతి, మహిళా విభాగం అధికారిణి డా. భ్రమరాంబిక, కంట్రోలర్ ప్రోఫేసర్ అరుణ, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్
ఘంటా చంద్రశేఖర్, ఈసీ మెంబర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, సారంగపూర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డా. సాయిలు, కళల పీఠాధిపతి ప్రొఫెసర్ త్రివేణి, లావణ్య, డా. నందిని, నీలిమ, సూపరిండింటెంట్ ఉమారాణి తదితర అధ్యాపక, అధ్యాపకేతర్, ఔట్ సోస్రింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన “బతుకమ్మ పేర్వడం” పోటీలో కంపూటర్ సైన్స్ విద్యార్థులు బహుమతి పొందారు.
Spread the love