పస లేని బ్యాటింగ్‌!

MS Dhoni– సూపర్‌కింగ్స్‌కు కొత్త కష్టాలు
– సొంతగడ్డపై తేలిపోతున్న వైనం
ఐదుసార్లు చాంపియన్‌, ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ప్రాంఛైజీ లీగ్‌లో నిలకడగా ఆడే జట్టుగా సూపర్‌కింగ్స్‌ పేరు గడించింది. సూపర్‌కింగ్స్‌ విజయాల్లో చెపాక్‌ కోట పాత్ర కీలకమైనది. కొన్ని ప్రాంఛైజీలు చెపాక్‌లో సూపర్‌కింగ్స్‌పై విజయం కోసం ఏకంగా 15-17 ఏండ్లు ఎదురుచూడాల్సి వచ్చిదంటేనే ఆధిపత్యం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌18లో సూపర్‌ కింగ్స్‌ కథ మారుతోంది. కంచుకోట చెపాక్‌లో వరుస పరాజయాలు చవిచూడగా.. బ్యాటింగ్‌లో ఎన్నడూ లేని ఒత్తిడి ఎదుర్కొంటుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐపీఎల్‌18లో ఐదుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగు మ్యాచులు ఆడింది. సొంతగడ్డ చెపాక్‌లో మూడు మ్యాచులు ఆడగా.. రెండింట పరాజయం పాలైంది. గువహటిలో ఆడిన మ్యాచ్‌లో భంగపాటుకు గురైంది. సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌లో నిలకడగా రాణించడానికి ముఖ్య కారణాల్లో చెపాక్‌ స్టేడియం ఒకటి. చెపాక్‌లో ఏడు మ్యాచుల్లో వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించటం సూపర్‌కింగ్స్‌ స్టయిల్‌. ప్రత్యర్థి గడ్డపై 2-3 విజయాలు సాధించినా.. సొంతగడ్డపై తిరుగులేని రికార్డుతో ప్లే ఆఫ్స్‌లో కచ్చితంగా చోటు సాధించగల పటిష్ట స్థితిలో ఉండటం సూపర్‌కింగ్స్‌ ప్రత్యేకత. ఈ సీజన్లో సూపర్‌కింగ్స్‌ కంచుకోట బద్దలవుతోంది. మ్యాజిక్‌ చేస్తారని ఆశించిన స్పిన్నర్లు, యువ బ్యాటర్లు అంచనాలను అందుకోవటం లేదు. ఫలితంగా హ్యాట్రిక్‌ పరాజయాలతో సూపర్‌కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసుకు దూరమయ్యే ప్రమాదంలో పడింది.
బ్యాటింగ్‌లో పవర్‌ ఏదీ?
చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో అసలు దూకుడు లేదు. సీజన్‌ ఆరంభం ముంగిట ఆటగాళ్ల వేలంలోనే సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ బలహీనత సుస్పష్టం. చెపాక్‌లో స్పిన్‌ అనుకూలిత పిచ్‌పై మాయ చేయగల స్పిన్నర్లు నూర్‌ అహ్మద్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ కోసం సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం కోట్లు ఖర్చు చేసింది. కానీ ఈ క్రమంలో బ్యాటింగ్‌లో అవసరమైన ధనాధన్‌ మంత్ర లోపించింది. రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, శామ్‌ కరణ్‌లు మంచి ఆటగాళ్లే. కానీ టీ20 క్రికెట్‌లో ధనాధన్‌ బ్రాండ్‌ క్రికెట్‌ ఆడిన గణాంకాలు వీళ్లకు లేవు. టాప్‌-3 బ్యాటర్లు డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్‌లపై ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. సాధారణంగా భారీ స్కోరు చేయటంలో, లక్ష్యాలను ఛేదించటంలో టాప్‌-3 బ్యాటర్లలో ఒకరు 15 ఓవర్ల పాటు క్రీజులో కుదురుకోవాలి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగియకముందే ఈ ముగ్గురు బ్యాటర్లు డగౌట్‌కు చేరుకున్నారు. లోయర్‌ ఆర్డర్‌లో ధనాధన్‌ ముగింపులపై యువ బ్యాటర్‌ శివం దూబె సూపర్‌ కింగ్స్‌ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ శివం దూబె ఈ సీజన్లో ఇంకా ఫామ్‌లోకి రాలేదు. రవీంద్ర జడేజా తనదైన మ్యాజిక్‌ చూపించాలని తపిస్తున్నా.. మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించటం లేదు. అంతిమంగా, ఓ ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సిన దశలో బౌలర్‌పై ఒత్తిడి పెంచే బ్యాటర్‌ సూపర్‌కింగ్స్‌ శిబిరంలో కరువయ్యాడు.
లక్ష్యం లేని వ్యూహం?
సూపర్‌కింగ్స్‌ వ్యూహం సైతం నిరాశపరిచేలా ఉంది. ఇతర జట్లు 200-250 స్కోర్లను అలవోకగా బాదగల బ్యాటింగ్‌ లైనప్‌లను తయారు చేసుకుంటే.. సూపర్‌కింగ్స్‌ పాత పంథాలోనే నడుస్తోంది. బెంగళూర్‌తో మ్యాచ్‌లో చివరి ఏడు ఓవర్లలో 80 పరుగులు అవసరమైన దశలో ఎం.ఎస్‌ ధోని కంటే ముందుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇటువంటి వ్యూహంతో ఏ విధంగా విజయాలపై గురి పెట్టాలని ఆశిస్తున్నారో జట్టు మేనేజ్‌మెంట్‌కే తెలియాలి. ఆ మ్యాచ్‌లో చెన్నై 50 పరుగుల భారీ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్పిన్‌ త్రయం ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. మధ్యాహ్నం మ్యాచ్‌లో బౌలర్లకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అటువంటిది ప్రపంచ శ్రేణి స్పిన్నర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని లోప భూయిష్టమైన ప్రణాళికలు సూపర్‌కింగ్స్‌ శిబిరం రచిస్తోంది. పస లేని బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాలను ఛేదించినప్పుడు సూపర్‌కింగ్స్‌ చేతులెత్తేస్తుంది. ముంబయి ఇండియన్స్‌పై 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే 19.1 ఓవర్లలో ముగించిన సూపర్‌కింగ్స్‌.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌పై 197 ఛేదనలో 146 పరుగులే చేసింది. 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్‌ రాయల్స్‌పై 183 ఛేదనలో 176 పరుగులే చేసి 6 పరుగుల తేడాతో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 184 పరుగుల ఛేదనలో 158 పరుగులకే పరిమితమైంది. 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
సమయం లేదు!
చెపాక్‌లో చెన్నై మరో నాలుగు మ్యాచులే ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఏడుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులో ప్రయోగించారు. నాలుగు మ్యాచుల్లో 17 మంది ఆటగాళ్లను బరిలోకి దింపారు. ఏ కాంబినేషన్‌ సైతం సూపర్‌కింగ్స్‌కు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. సీజన్‌లో సహజంగా 11-12 మందితోనే వేట సాగించటం సూపర్‌కింగ్స్‌ శైలి. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లో ఏ కూర్పు కుదరటం లేదు. లీగ్‌ దశలో మరో 10 మ్యాచులే ఆడాల్సి ఉండగా.. లోపాలు దిద్దుకునేందుకు సూపర్‌కింగ్స్‌కు ఇదే సరైన తరుణం. లేదంటే, ఈ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.

Spread the love