– కొంపముంచిన చెల్లని ఓట్లు.
నవతెలంగాణ – మల్హర్ రావు:
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలా బాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి కాంగ్రెస్ పార్టీ లో భారీ కుదుపునకే దారి తీస్తోంది. పార్టీలో సమస్వీయ లోపాలు, అనైక్యత, పరస్పర సహకారం కొరవడటం తదితర వైఫల్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు, 2025లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇలా ఏడాదిన్నర కాలంలో కరీంనగర్ లో కాంగ్రెస్ వరుసగా ఓడింది. కానీ, ఈసారి ఓటమిపై పార్టీలో చర్చనడుస్తోంది. వాస్తవానికి 15 జిల్లాలు, 42 నియోజకవర్గాలలోని గ్రాడ్యుయేట్ల కోసం ఎన్నిక జరిగినా.. ప్రచారం, నామినేషన్, రాజకీయం అంతా కరీంనగర్ కేంద్రంగానే జరిగింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం, ఉమ్మ డి జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులతో కలిసి భారీ బహిరంగసభ నిర్వహించడం, సిట్టింగ్ సీట్లో ఓటమిపై మునుపెన్నడూ లేని చర్చ నడుస్తోంది.
చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు
వాస్తవానికి నరేందర్రెడ్డికి తన ప్రత్యర్థి అంజిరెడ్డి( బీజేపీ)కన్నా కేవలం 5,106 ఓట్లు తక్కువగా వచ్చాయి. అదే సమయంలో 28,686 ఓట్లు చెల్లనివి వచ్చాయి. ఈ ఓట్లలో దాదాపు 16వేల ఓట్లు నరేందర్రెడ్డికే పడడం దురదృష్టకరం. అందులోనూ ఆరువేలకుపైగా ఓట్లు కేవలం అంకె ముందు సున్నా వేయడం వల్ల చెల్లకుండా పోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. అదే సమ యంలో బీజేపీ జిల్లా, మండలం, గ్రామం, బూత్ వలవరకు పోల్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా నిర్వహించింది.ప్రతి 25 మందికి ఒక ఇంచార్జిని నియమించి ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో క్యాడర్ సమీకృతమైయ్యారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపం,ఆధిపత్య పోరు పోల్ మేనేజ్మెంట్ వైపల్యాలు కారణంగా ఓటర్ ను ప్రసన్నం చేసుకోవడంలో దెబ్బతిన్నారు.
ఎక్కడెక్కడ బలహీనం అంటే?
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతను ఎంపిక చేయడం లోకల్ పలువురు నాయకులకు నచ్చలేదు. కీలకమైన కరీంనగర్ నుంచి మరో నాయకుడు ఎదగడం తమ పార్టీలోనే ముగ్గురు ముఖ్యనేతలకు ఇష్టం లేదని ఓటమి అనంతరం నరేందర్రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. గెలవగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారంతో కొందరు ముఖ్యనాయకులు పార్టీ ఎన్ని కల ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా వ్యహరిం చారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్కు తక్కువ ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, ధర్మపురి, మానకొండూర్లో తక్కువ ఓట్లు వచ్చాయని సాక్షాత్తూ నరేందర్రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండంలో కాం గ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చేందుకు నరేందర్రెడ్డి సిద్ధమవుతున్నారు.