తులం బంగారం కోసం వేచిచూస్తున్న లబ్దిదారులు

– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తులం బంగారం కోసం వేయి కన్నులతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్దిదారులు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జల్‌పల్లి మున్సిపాలిటీలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను శుక్రవారం లబ్దిదారులకు మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, జల్‌ పల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ అబ్దుల్లా బిన్‌ సాదిలతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 30 చెక్కులు, జల్‌పల్లి మున్సిపాలిటీలో 42 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా లబ్దిదారులందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కంటే ముందు మాజీ సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉన్న సమయంలో మహేశ్వరం నియోజకవర్గం అభివద్ధి కోసం రూ.250 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఆ పనులు ప్రారంభించలేదని.. ఆ నిధులను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గం అభివద్ధిని అడ్డుకోవద్దని, తక్షణమే ఆ నిధులను తిరిగి మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. చెక్కుల పంపిణీలో డిప్యూటీ మేయర్‌ ఇబ్రహీం శేఖర్‌, బాలాపూర్‌ తహశీల్దార్‌ మాధవి రెడ్డి, డి.టీ.మణిపాల్‌ రెడ్డి, బడంగ్‌పేట్‌, జల్‌ పల్లి కమిషనర్లు రఘు, వీణారెడ్డి, కార్పొరేటర్లు, ఫ్లోర్‌ లీడర్‌ అర్జున్‌, కో ఆప్షన్‌ సభ్యులు, జల్‌ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love