భగ భగ మండే ఎర్రటి ఎండలో ఉపాధి పనులు

– జాడలేని టెంట్లు
–  ఇబ్బందులు పడుతున్న కూలీలు
నవతెలంగాణ – చండూరు
సూర్యుడి భగభగలతో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. తాగేందుకు నీళ్లు లేక.. సేదతీరేందుకు నిలువ నీడ కరువై అవస్థలు పడుతున్నారు.  మండలంలో  గతవారం రోజుల నుంచి 43డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఉన్నా వేడి గాలులకు తట్టుకోలేకపోతున్న తరుణంలో ఇక ఎండలో పనులు చేస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉపాధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వందలాది  కుటుంబాలు రోజువారీగా ఉదయమే పనులకు వెళ్తున్నారు. ఈ తరుణంలో పని ప్రదేశాల్లో వివిధరకాల సౌకర్యాలు కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టిసారించడం లేదు. ఫలితంగా ఉపాధికూలీలు ఎండవేడిమి భరించలేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ప్రస్తుతం వేసవి కాలం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి 45 వరకు ఉన్న తరుణంలో ప్రజలు అత్యవసర సమయంలోనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ, ప్రభుత్వాలు ఆదేశాలు చేస్తుంటే మరోపక్క అదే ఉష్ణోగ్రతలో ఉపాధి పనులను ఎర్రటి ఎండలోనే కొనసాగిస్తున్నారు. పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు తాగునీరు, అనుకోకుండా కూలికి ఏదైనా అయితే ప్రథమ చికిత్సను అందించేందుకు హెల్త్ కిట్లు, ఎండే నుండి సేద తీరేందుకు టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ఈ వసతులు కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కూలీలు చేసేది ఏమీ లేక ఎర్రటి ఎండలోనే పనులు చేస్తు వడదెబ్బకు గురవుతున్నారు. చండూరు  మండలంలో  9,715 మంది జాబ్ కార్డులో గాను  4,663 మంది ఉపాధిహామీ పనిని వినియోగించుకుంటున్నారు.గ్రామాలలో ఉపాధి పనులు   చురుకుగా  కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  ముఖ్య ఉద్దేశం పని లేని వారికి ఉపాధి కల్పించి వారి కి పని ప్రదేశాలలో కావలసిన సౌకర్యాలను అందజేయాలి. కానీ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమౌతుందని చెప్పొచ్చు. ఈ పథకంలో భాగంగా ప్రతినిత్యం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. కానీ పని ప్రదేశంలో కూలీలు తాగునీటిని ఇంటి నుండి బాటిళ్లతో తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది . ఏప్రిల్ ఒకటి నుండి నీటి వసతిని కల్పిస్తు న్నాయని అధికారులు చెబుతున్నారు. కూలికి ప్రమాదవ శత్తు ఏమైనా జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు హెల్త్ కిట్లు, టెంట్లు ప్రభుత్వం నుండి అందలేదని సమాచారం. 2011 నుండి ఇప్పటివరకు పని ప్రదేశాలలో ప్రభుత్వం టెంట్ల ఏర్పాటుకు నిధులను మాత్రం అందజేయలేక పోతుంది. ఫలితంగా ఉపాధి కూలీలు ఎర్రటి ఎండలోనే పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది.
చెట్టు నీడలే శరణ్యం..
పని ప్రదేశాలలో టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధి కూలీలు ఎండ నుండి సేద తీరేందుకు చుట్టుపక్కల గల చిన్న చిన్న చెట్లే శరణ్యం అంటున్నారు. ఉపాధి పనులు చెరువుల్లో నడవడం వల్ల కొన్ని కొన్ని ప్రదేశాలలో ఆ చెట్లు కూడా ఉండకపోవడంతో ఎండదెబ్బకు గురై అనారోగ్యాల పాలవుతున్నారు. వడదెబ్బ తాకిడికి ఉపాధి కూలీలు మృతి చెందిన ఘటనలు  చోటుచేసుకున్నాయి.
పని ప్రదేశంలో దెబ్బ తగిలినా పట్టించుకోలేదు: గంట పద్మ  ఉపాధికూలీ  శిర్థపల్లి
పని చేస్తుండగా పక్కనుండి   గడ్డపార వచ్చి  కను గుడ్డు  కు దెబ్బ తగిలింది. దీంతో ముఖం వాసింది. గవర్నమెంట్   హాస్పిటల్ కి వెళ్లి చేయించుకున్నాను. ప్రైవేట్  లో మందులు కొనుక్కొని  వాడాను. ఖర్చులకు డబ్బు ఇవ్వలేదు, ఇంకా సమస్యలతోనే ఉన్నాను. పని ప్రదేశంలో దెబ్బలు తగిలితే పట్టించుకోవడం లేదు, అధికారులు చొరవ చూపలి.
ఎలాంటి సౌకర్యాలు లేవు : సల్ల అంజిరెడ్డి,  ఉపాధికూలీ  శిర్థపల్లి
పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు లేవు, తాగేందుకు   నీటిని ఇంటి నుంచే  తెచ్చుకుంటున్నాం. నీడ కోసం టెంట్లు   లేవు. గడ్డపారలు కూడ ఇవ్వడం లేదు. ఎండలోనే పనులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు ఉండటంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. అధికారులు ఈ సమస్యపై దృష్టిసారించి పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి.
ఏ ఊరి గ్రామపంచాయతీ  నుండి వాళ్ళే సప్లై చేయాలి.. ఏపీవో శీను
ప్రస్తుతం…. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  మండలంలో ఏ  గ్రామపంచాయతీ నుండి ఉపాధి పనులు చేస్తున్నారో ఆ గ్రామపంచాయతీ నుండి కూలీలకు  నీడ,త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్టు  అందించాల్సింది  గ్రామ పంచాయతీల వారే… గతంలో   సెంట్రల్ ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది, తద్వారా     అందజేసేది. ప్రస్తుతం  వాళ్లకు లేదు.

Spread the love