భానుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేసవి కాలం మొదటిలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇలా వుంటే ముందు ముందు ఇంకా ఎండలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది..దీంతో మే నెలలో వేసవిని ఎలా ఎదుర్కోవాలన్న భయాందోళన ప్రజలను వెంటాడోతుంది. మరి ఈ వేసవి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
గత ఏడాది ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించలేదు. అయితే ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదైంది. దీంతో ఇంట్లోంచి బయటకి రావాలంటే జనం భయపడిపోతున్నారు. ఇళ్లలో కూడా ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుండటంతో రోడ్లపై జనం పలచబడుతున్నారు. రోజువారి పనులు సైతం కొందరు ప్రజలు ఉదయమే వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ఇళ్లకు పరిమితమవుతున్నారు.
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ, వ్యాధులు, వాటి లక్షణాలు, నివా రణ పై అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. పరిస్థితికి అనుగుణంగా ఆహారం, తాగునీరు తీసుకోవాలి. వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి…
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో గొడుగు తప్పనిసరిగా వాడాలి
– దూదితో నేయబడిన తెలుపు / లేత రంగు గల పలుచటి వస్త్రాలను ధరించాలి.
– తల పై టోపి లేదా రుమాలు పెట్టుకోవాలి.
– ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా సేవించాలి.
– ఉప్పు కలిపిన మజ్జిగ / చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు నీరు / ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణము తాగవచ్చును.
– వడదెబ్బకు గురైన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
– వడదెబ్బకు గురైన వారివి చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడుస్తూ ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చేవరకు ఈ విధంగా శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాన్ క్రింద ఉంచాలి.
– వడదెబ్బకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మార్పు లేనిచో శీతల వాతావరణంలో దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి.
– సూర్య కిరణాలకు, వేడి గాలికి ఎక్కువ గురి కాకూడదు.
– వేడిగా ఉన్న సూర్యకాంతిలో గొడుగు లేకుండా తిరగరాదు.
– వేసవిలో నలుపు/ ముదురు రంగు దుస్తులు మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
– నెత్తిన టోపీ లేక రుమాలు లేకుండా సూర్యకాంతిలో తిరగరాదు.
– వడదెబ్బకు గురైన వారిని వేడినీటిలో ముంచిన గుడ్డతో తుడవరాదు.
– దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాహం, డీహైడ్రేషన్, వడదెబ్బ, జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు వంటి సమస్యలు వేడికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలుగా కనిపిస్తాయి.
వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు
డీహైడ్రేషన్, వడదెబ్బ :
అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, దాంతో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ లోపించి వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది.ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడే కాకుండా, తగినంత నీరు తాగకపోయినా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది.
వడదెబ్బ లక్షణాలు :
తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తునిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి
ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు :
వేసవిలో గాలి పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ధూళి, పొగ, పొల్యూషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండటాన్ని నివారించాలి. ఆస్తమా ఉన్నవారు తమ వెంట ఇన్హేలర్, మెడిసిన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.
చర్మ సమస్యలు, అలర్జీలు :
చెమట అధికంగా కారడం వల్ల చర్మం మురికితో ముడిపడి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, రాషెస్ ఏర్పడతాయి. శోభి మచ్చలు (తినియా వెర్సికలర్) వేసవిలో అధికంగా ప్రబలతాయి.యూవీ రేడియేషన్ కారణంగా చర్మం కమిలిపోవడం, సన్‌బర్న్, మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.
విరేచనాలు, కలరా :
వేసవిలో భోజనం త్వరగా పాడవడం, నీటి కాలుష్యం పెరగడం వల్ల విరేచనాలు, కలరా వంటి సమస్యలు వస్తాయి. రహదారి పక్కన ఉన్న ఆహారం, కలుషితమైన నీరు తాగడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు:
వేసవిలో నీటి తగ్గుదల వల్ల మూత్రంలో మలినాలు పేరుకుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది.తగినంత నీరు తాగకపోతే కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ.
వేసవి జాగ్రత్తలు, నివారణ చర్యలు :
– రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
– ఒకసారి ఉడికించిన లేదా ఫిల్టర్ చేసిన నీరు తాగాలి.
– పొడిగా, వేడిగా ఉండే ఆహారాన్ని తగ్గించి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
– పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం ఉత్తమం.
– ఊపిరితిత్తుల సమస్యలున్నవారు వైద్యుల సూచనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
– కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
– ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల సన్‌బర్న్, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి, కాబట్టి సన్‌స్క్రీన్ వాడడం, హాట్ టైమ్‌లో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది.
– హైడ్రేటింగ్ ఫుడ్స్ (కాకర, దోసకాయ, మజ్జిగ, కొబ్బరి నీరు) తినడం వల్ల వేడి తగ్గుతుంది.
వేసవిలో ప్రకతి :
వేసవి కాలం ప్రకతిలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. చెట్ల ఆకులు పచ్చగా ఉండి, పశువులు నీటి ప్రదేశాలకు చేరుకోవడం, పక్షులు చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం వంటి దశ్యాలను మనం చూస్తాం. వేసవిలో ప్రజలు ప్రకతి ప్రేమను మరింత అనుభూతి చెందుతారు, అదే సమయంలో ప్రకతిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
సూర్యుడి వేడి ప్రభావం వేసవిలో మానవుని ఆరోగ్యానికి పెద్ద ముప్పు కావచ్చు. దీన్ని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన జాగ్రత్తలు పాటించడం, సురక్షితమైన వేళల్లో బయటకు వెళ్లడం చాలా ముఖ్యం. అలాగే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి.
శరీరాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి!
ఆరోగ్యమే మహాభాగ్యం..!
భానుడి ప్రతాపం మాతృమూర్తుల సంరక్షణ
గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం తరువాత శిశువుకు పాలిస్తున్నప్పుడు తల్లి కొంత ఒత్తిడిలో ఉంటుంది. దానికి వేసవి తోడయితే అది ఆమె శక్తికి వరీక్షే. కానీ అవగాహన, సంరక్షణ, చిన్ని, చిన్ని జాగ్రత్తలు, సర్దుబాట్లు ఉంటే ఈరుతువు లో సంతోషంగా గడపగలుగుతారు.
ద్రప పదార్థాలు: 10-12 గ్లాసుల నీటిని తాగాలి. నీటికి నిమ్మ, పుదీన, కీరదోసను కలవండి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, తాజా పండ్ల రసాలను తాగండి. నోరు ఎండిపోవడం, ముదురు రంగు మూత్రం, తల తిరగడం లాంటి లక్షణాలు ఉన్నాయేమో గమనించండి.
ఆహారం: తక్కువ తక్కువ ఆహారాన్ని ప్రతి 2-3 గంటల కొకసారి తినండి. రాగిజావ, ఆవిరిలో ఉడకబెట్టిన కాయగూరలు, పప్పన్నం తినండి. నీరు ఎక్కువగా ఉండే వుచ్చకాయ, బత్తాయి, కర్బూజా లాంటి పండ్లను తినండి. కారం, మషాలా, పచ్చళ్ళు, నూనె పదార్థాల్ని తినకండి.
దుస్తులు: వదులుగా వుండే, మెత్తటి, తేలిక రంగు, నూలు దుస్తుల్ని వేసుకోండి. బిగుతుగా వుందే దుస్తుల్ని, సింథటిక్ దుస్తుల్ని వేసుకోకండి. వేడి వలన వచ్చే దద్దుర్లను తగ్గించుకోవడానికి చల్లగా ఉండే టవల్ని, తేలికగా వుండే టాల్కమ్ పౌడర్‌ని వాడండి.
బయట తిరగడం: తవ్వనిసరిగా బయటకు వెళ్లవలసి వస్తే నీరు, గొడుగు, సన్‌గ్లాసెస్, టవల్స్‌ని మీతో తీసువెళ్ళండి. వీలయినంతవరకు నీడలో ఉండండి. జనం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి.
చర్మ సంరక్షణ: చాలా తేలిక సబ్బును ఉపయోగించండి. అలోవేరా జెల్ లేక వ్రకృతి సహజమైన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. రోజుకు రెండు సార్లు స్నానం చెయ్యండి.
ఈకింది లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి :
– కళ్ళు మసకగా కనిపిస్తుననుడు లేక తీవ్రమైన తలపోటున్నప్పుడు, చేతులు, ముఖం వాచినప్పుడు, బిడ్డ కదలికలు తగ్గినప్పుడు, తీవ్రమైన అలసట ఉన్నప్పుడు లేక ఊపిరి సరిగ్గా అందనప్పుడు.
బాలింతరాలు తీసుకోవలసిన జాగ్రత్తలు
– ఓట్లు, మెంతికూర, వెల్లుల్లి, వచ్చటి ఆకుకూరల్ని తినండి.
– ఇంట్లో వండిన, తేలిగ్గా జీర్ణమయే ఆహారాల్ని తినండి. వాము నీటిని తాగొచ్చు.
– మషాలా, కారం, నూనె, పులిసిన పదార్థాల్ని తినకండి.
-10-12 గ్లాసుల నీటిని తాగండి, ఉప్పు, కరివేపాకును మజ్జిగలో కలిపితే మంచిది.
– ఉదయం జీలకర్ర నీటిని తాగండి. తాజా పండ్ల రసాల్ని, బెల్లం కలిసిన నిమ్మ నీటిని తాగండి.
పరిశుభ్రతను పాటించండి: నర్శింగ్ బ్రాలను ఉపయోగిస్తూ వుంటే రోజుకు రెండు సార్లు మార్చుకోండి. ఫంగల్ దద్దుర్లు రాకుండా నివారించుకోవడానికి పాలిచ్చాక రొమ్ముల్ని శుభ్రంగా తుడుచుకోండి.
ఇవి చెయ్యకండి: ఒక పూట ఆహారాన్ని తినకుండా ఉండడం లేక అతిగా తినడం బాగా నూనె పదార్థాలు, బయటి పదార్థాలు, లేక పాడైపోయిన పదార్థాల్ని తినడం, బిగుతుగా ఉన్న, నిందటిక్ దుస్తుల్ని వేసుకోవడం, ఉక్కగా ఉన్న, గాలి తగలని చోట ఉండడం, ఓపిక లేకపోయినప్పటికి పని చేస్తూ ఉండడం.
– డా.ఆలూరి విజయలక్ష్మి, గైనకాలజిస్ట్
శ్రీ శ్రీ హౌలిస్టిక్ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్, హైదరాబాద్
వేసవిలో పిల్లలు జాగ్రత్త
చలికాలం దగ్గులు, తుమ్ములు పోగానే మండే వేసవి జడిపిస్తుంది. వేడికి, దాహానికి ఆగలేక ఎక్కడ దొరికితే అక్కడ చల్లటి నీళ్లు, లేదా కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీం తీసుకోవడం పరిపాటి. ఆ నీళ్లు ఎక్కడివో, ఆ డ్రింక్‌లో వేసిన ఐసు ఎక్కడిదో ఆలోచించడం జరగదు. వేసవిలో ఈ కలుషితమైన నీటివల్ల, వాటినుంచి తయారు చేసిన ఐసు వల్ల కలరా, జాండిస్, టైఫాయిడ్, అతిసారవ్యాధి వంటివి సోకితే జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటివే కాక ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం వల్ల వేగంగా డీహైడ్రేషన్ బారిన పడతాం. అందుకే పిల్లలకి వేసవిలో ఇచ్చే ఆహారం, నీరు చాలా శుభ్రంగా వుండాలి. పైగా ఈ కాలం ఆహారం చాలా త్వరగా చెడుతుంది. అందుకని బయట తినే ఆహారాన్ని, నీటిని నియంత్రిస్తే పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.
ఇవి కాక వేడి వల్ల తీవ్రమైన జ్వరానికి దారితీయవచ్చు. ఉదయం పది తర్వాత పిల్లలు సాయంత్రం వరకు నీడ పట్టున వుండేలా ఆటపాటలతో, కథలతో పుస్తకాలతో అందరూ కలిసి చేసే కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తే మంచింది. కాకపోతే హీట్ హైపర్ పైరెక్సియాతో శరీర ఉష్ణోగ్రతని, నియంత్రించే మెదడు సెంటర్ దెబ్బతిని పోయి ప్రాణాంతకమయ్యే ప్రమాదంవుంది. నీరసం, చెమటలు పట్టకపోవడం, మూత్రం ఆగిపోవడం వంటి వేడి తగ్గకపోవడం, కళ్లు తేలేయడం, ఎమర్జెన్సీ లక్షణాలు. జ్వరంతో వచ్చే ఫిట్స్ ఆరేళ్ల లోపు పిల్లల్లో సర్వ సాధారణం.
ఎప్పటి కప్పుడు చన్నీళ్లతో కాళ్లూ, చేతులూ ముఖం కడుక్కోవడం వల్ల వేడి వల్ల వచ్చే చర్మవ్యాధులని నియంత్రించవచ్చు.
టీకాలు సరిగా వేయించుకోని పిల్లలకి వేసవిలో ఆటలమ్మ సోకవచ్చు. ఇది ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. అందుకని ఆ పిల్లల్ని ఐసోలేషన్‌లో వుంచి చికిత్స చేస్తే మంచిది.
నీళ్లు సరిగా తాగకపోతే డీ హైడ్రేషన్ అవక మూత్రం ఇన్‌ఫెక్షన్ కూడా సంభవించవచ్చు. అందుకే శుభ్రమైన నీరు, ఆహారం, నీడపట్టున ఆటలు, తగిన నిద్ర వేసవిలో అవసరం.
డా|| నళిని