నవతెలంగాణ-హైదరాబాద్ : ఐడీబీఐ బ్యాంక్‌కు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ భారతీయ యూనివర్సల్ బ్యాంక్‌గా నిలిచే సామర్థ్యం ఉందని కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థ అభిప్రాయపడింది. బ్యాంకింగ్‌తో పాటు బీమా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను విస్తరించి సమగ్ర ఆర్థిక సేవల సంస్థగా దీనిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో రూ.52,878 కోట్ల విలువైన 60.72 శాతం నియంత్రణ వాటా కొనుగోలుకు ఒక్కో షేరుకు రూ.81 చొప్పున బిడ్ ను ఫెయిర్‌ఫాక్స్ దాఖలు చేసింది. ప్రభుత్వ స్వతంత్ర మదింపు ధర రూ.75.99 కంటే అధిక ధరను ఆఫర్ చేసి పోటీ బిడ్డింగ్‌లో ముందంజలో నిలిచింది.
ఫెయిర్‌ఫాక్స్ బిడ్ ధర 2026 మార్చి 31 నాటికి ఐడీబీఐ బ్యాంక్ నియంత్రణ పుస్తక విలువ ఒక్కో షేరుకు రూ.51.85తో పోలిస్తే 56 శాతం అధికం.
ఫెయిర్‌ఫాక్స్ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పీటర్ క్లార్క్ మాట్లాడుతూ"అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అత్యుత్తమ భారతీయ యూనివర్సల్ బ్యాంక్‌గా ఎదిగే సామర్థ్యం ఐడీబీఐకి ఉందని మేము భావిస్తున్నాం. ఇది దేశ క్రెడిట్-టు-జీడీపీ నిష్పత్తిని పెంచడంతో పాటు సామాన్య పౌరుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి దోహదపడుతుంది" అని పేర్కొన్నారు. కొనసాగుతున్న లావాదేవీలపై వ్యాఖ్యానించడం తమ సంస్థ విధానం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఈ కొనుగోలు పూర్తయితే ఐడీబీఐ బ్యాంక్‌పై ఫెయిర్‌ఫాక్స్‌కు నిర్వహణ నియంత్రణ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కలిపి 34 శాతం వాటాను కొనసాగించనున్నాయి.
ఈ విక్రయంలో నీతి ఆయోగ్ పాత్రపై వస్తున్న సందేహాలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్ ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) కాదని, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అని పేర్కొన్నాయి. పీఎస్‌యూల జాబితాను గుర్తించేందుకు మాత్రమే నీతి ఆయోగ్‌ను కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. మాజీ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, బ్యాంక్ విక్రయాన్ని సిఫారసు చేసిన ఏ ప్రభుత్వ కమిటీలోనూ సభ్యుడిగా లేరని వెల్లడించాయి. 2022లో నీతి ఆయోగ్ నుంచి వైదొలిగిన ఆయన 2025లో ఫెయిర్‌ఫాక్స్‌లో చేరారని వివరించాయి.
ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుతో పాటు తమకు చెందిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలను, ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్‌కు చెందిన ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ వాటాను బ్యాంక్‌తో అనుసంధానించాలని ఫెయిర్‌ఫాక్స్ యోచిస్తోంది. ఈ వ్యాపారాల బదిలీ ప్రక్రియ 60.72 శాతం వాటా కొనుగోలుకు సంబంధించిన ఒప్పందానికి వేరుగా ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా ఐడీబీఐ బ్యాంక్ షేర్లు లేదా సంబంధిత అధికారుల అనుమతితో ఇతర మార్గాలను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం.
ఒకప్పుడు మొండి బకాయిలు, మూలధన కొరతతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఐడీబీఐ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.9,000-10,000 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లాభాల్లో ఉన్న బ్యాంకును ఎందుకు ప్రైవేటీకరించాలనే ప్రశ్నలు వచ్చినప్పటికీ, మెరుగైన ఆర్థిక పరిస్థితిని ఉపయోగించుకుని విస్తృత ఆర్థిక సేవల సంస్థగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ వ్యూహమని ఆ వర్గాలు వివరించాయి.






కామెంట్‌లు (0)