నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండెల్ గ్రూప్‌లో భాగమైన ప్రముఖ గోల్డ్ లోన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) ఇండెల్ మనీ లిమిటెడ్.. సెప్టెంబర్ 2026తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2 ఎఫ్వై27) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.79.98 కోట్ల పన్ను అనంతర లాభాన్ని (పీఏటీ) నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 222 శాతం వృద్ధిగా నమోదు అయింది. ఈ ఆర్థిక ఫలితాలను నవంబర్ 5, 2026న జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఆమోదించారు .
2026 సెప్టెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (హెచ్1 ఎఫ్వై27) కంపెనీ రూ.107.62 కోట్ల పన్నుల అనంతర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 121 శాతం అధికం. కంపెనీ మొత్తం నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 83 శాతం పెరిగి రూ.5,015 కోట్లకు చేరుకుంది. నికర ఆదాయం 111 శాతం వృద్ధితో రూ.159.81 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 118 శాతం పెరిగి రూ.145 కోట్లుగా నమోదైంది.
కంపెనీ ప్రధాన వ్యాపార కార్యకలాపాల లాభదాయకతను సూచించే కీలకమైన ప్రీ-ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ (పీపీఓపీ) 182 శాతం వృద్ధితో రూ.98.95 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.41 శాతంగా నమోదయ్యాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ నిష్పత్తి తగ్గడం గమనార్హం.
క్యూ2లో కంపెనీ ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 6.85 శాతంగా ఉండగా, హెచ్1లో 4.85 శాతంగా నమోదైంది. త్రైమాసికం చివరి నాటికి సీఆర్ఏఆర్ 22.20 శాతంగా ఉంది. ఇది నియంత్రణ సంస్థ నిర్దేశించిన 15 శాతం కనీస అవసరం కంటే ఎక్కువ.
కంపెనీ పనితీరుపై ఇండెల్ మనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఉమేశ్ మోహనన్ మాట్లాడుతూ.. “గత కొన్ని త్రైమాసికాలుగా ఇండెల్ మనీ సాధిస్తున్న వృద్ధి వేగానికి క్యూ2 ఎఫ్వై27 ఫలితాలు నిదర్శనం. లాభదాయకతలో గణనీయమైన మెరుగుదలతో పాటు ఏయూఎంలో నమోదైన వృద్ధి, మా కార్యకలాపాల విస్తరణను, వినియోగదారులకు అందిస్తున్న సేవల బలాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
భారతదేశ గోల్డ్ లోన్ మార్కెట్లో, ముఖ్యంగా ఇప్పటివరకు తగినంత సేవలు అందని ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. మా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటూనే, కో-లెండింగ్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా మా సేవల పరిధిని విస్తరించి, వ్యాపారాన్ని వైవిధ్యపరచుకుంటున్నాం” అని తెలిపారు.
ఈ త్రైమాసికంలో ఇండెల్ మనీ గోద్రేజ్ ఫైనాన్స్‌తో కో-లెండింగ్ ఒప్పందం కుదుర్చుకుని రుణాల పంపిణీని కూడా ప్రారంభించింది. సెప్టెంబర్ 2026 నాటికి మొత్తం మూడు సంస్థలతో కంపెనీ కో-లెండింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి మొత్తం విలువ రూ.1,400 కోట్లుగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సంస్థలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోవాలని కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
అంతేకాకుండా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై27) ముగిసే నాటికి ఏయూఎంను రూ.6,200 కోట్లకు మించి పెంచాలని ఇండెల్ మనీ లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లోగా, అంటే ఎఫ్వై30 నాటికి స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వెళ్లాలని కూడా కంపెనీ యోచిస్తోంది.







కామెంట్లు (0)