కేసీఆర్‌ను రక్షించేందుకు బీజేపీ తాపత్రయం

– కాళేశ్వరంపై సీబీఐ విచారణ అడగటంలో అంతర్యమిదే..: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ సీఎం కేసీఆర్‌ పేరు బయటకు రాకుండా ఆయన్ను రక్షించేంందుకు బీజేపీ తాపత్రయ పడుతున్నదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఒకవైపు కాళేశ్వరంపై జ్యూడీషియల్‌ విచారణ జరుగుతుండగా, మరోవైపు ఆ పార్టీ సీఐబీ విచారణ అడుగుతన్నదని తెలిపారు. ఫోన్‌ ట్యాంపరింగ్‌ కేసు సీబీఐ అప్పగించాలంటూ బీజేపీ ఇందిరాపార్కు వద్ద మరో డ్రామాకు తెరలేపిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ సెల్‌ చైర్మెన్‌ బెల్లయ్య నాయక్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఎలా కొమ్ముకాసిందో అందరికీ తెలుసనన్నారు. అందుకు ప్రతిఫలంగా కేసిఆర్‌ను కాపాడేందుకు కమలనాథులు నిశ్చహించు కున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో కాళేశ్వరం మీద కేంద్ర బృందాలతో నివేదిక తెప్పించుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీ ఇప్పటికే ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెట్టించి పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నదని చెప్పారు. కేసిఆర్‌ను ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నుంచి రక్షించడం ఎవరి తరం కాదన్నారు. బీఎల్‌ సంతోష్‌ కుమార్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఇరికించారనీ, దాన్ని ఎందుకు బీజేపీ నేతలు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.

Spread the love