బీజేపీ ప్రజాస్వామ్య పరిపాలన అందించాలి

– ఓయూ కాంగ్రెస్‌ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ
నవతెలంగాణ-ఓయూ
దేశంలో బీజేపీ ప్రజాస్వామ్య పరిపాలన అందించాలని ఓయూ కాంగ్రెస్‌ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ కోరారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన పదేండ్లలో ప్రధాని మోడీ బీజేపీ పరిపాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిపాలన కొనసాగించారని… దేశవ్యాప్తంగా ఎంతోమంది పౌర హక్కుల నాయకులను, మేధావులను,అకారణంగా సుదీర్ఘకా లం పాటు జైళ్లలో బంధించారని తెలిపారు. పౌర హక్కుల ను కాలరాస్తూ భారతదేశ జీవన విధాన విలువలైన భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక వాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వం వంటి విలువలను విస్మరించి, సమాజాన్ని విచ్చిన్నం చేసేలా మైనార్టీ మతం పేరు మీద ప్రజలను విభజిస్తూ ఎన్నోవేదికలపై ప్రసంగాలు చేశారని చెప్పారు. రైతుల హక్కుల పోరాటాలపై నిర్బంధాలు, లాఠీ చార్జీలు, విధిస్తూ రైతు సంఘాల నాయకుల పై తీవ్రవాదులనే ముద్ర వేశారన్నారు. అలాగే జీఎస్టీ, నీట్‌ లాంటివి ప్రవేశ పెట్టి ఈడీ, సీబీఐ వంటి సెంట్రల్‌ ఏజెన్సీ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చారని మండిపడ్డారు. ఓబీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించకుండా, పరిశోధనకు అందించాల్సిన ఫెలోషిపులు తీసివేశారని, పెట్రోల్‌, డీజిల్‌,నిత్యావసర ధరలు పెరుగుదల వంటిదే కాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను విస్మరించి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఈ దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులైన అదానీ, అంబానీలకు ధారాదత్తం చేయడం మోడీ నైజం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పార్ధు, అభిలాష్‌, కళ్యాణ్‌ ,మహిపాల్‌ ,భూమన్న పాల్గొన్నారు.

Spread the love