– కేసీఆర్, ఒవైసీపై ఒక్క కేసైనా పెట్టారా..
– కేంద్రం తెచ్చిన చట్టాలకు మద్దతు ఇచ్చారు
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
– నాంపల్లి బజార్‌ఘాట్‌లో సభకు ఆటోలో వచ్చిన రాహుల్
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
బీజేపీకి ఎంఐఎం బీ టీమ్‌గా పని చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయి స్తుందని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో నిర్వహిం చిన ఎన్నికల సభకు రాహుల్‌గాంధీ ఆటోలో వచ్చారు. భద్రతా వాహనాలను ముందు పంపించి ఓ సామాన్యుడి మాదిరిగా ఆటోలో సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటివరకు నిరంకుశ ప్రభుత్వం ఉందని, డిసెంబర్లో ప్రజల ప్రభుత్వం వస్తుందన్నారు. కాళేశ్వరం మొదలుకొని అన్ని ప్రాజెక్టుల్లోనూ అవినీతి రాజ్యమేలిందన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రేమతో కూడిన దేశాన్ని నిర్మించేందుకు చేసిన ప్రయత్నానికి ఎంతో ఆదరణ లభించిందని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ పేరుతో 24 గంటలు అధికారులను, ఏజెన్సీలను తన వెంటే ఉంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై 24 కేసులు నమోదు చేశారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో కోపం, ద్వేషాన్ని పెంపొందించి మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీ, సీఎం కేసీఆర్‌పై ఏదైనా కేసు పెట్టిందా? విచారణ జరిపారా.. ఉంటే చూపించమని ప్రశ్నించారు. వీరంతా బీజేపీకి మద్దతుదారులుగా ఉంటూ రైతు చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో కలిసి కట్టుగా మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల ఖర్చును చూపించి తెలంగాణ ప్రజల డబ్బులు దండుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా 20 లక్షల మంది భూములను లాక్కున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజల నుంచి లాక్కున్న డబ్బులు మొత్తం త్వరలో కట్టిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదులో మెట్రో, ఎయిర్పోర్ట్, ఐటీసీటీ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు. నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ… ఎంఐఎం ముస్లీంల అభివృద్ధి కోరుకోవడం లేదన్నారు. నాంపల్లిలో ఓటమి భయంతో ప్రతి ఇంటికీ ఒవైసీ తిరుగుతున్నారని చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే నాంపల్లిని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.