పక్కగా.. నల్లాల లెక్క

– మిషన్ భగీరథ పథకం పనితీరు పరిశీలన
– ప్రత్యేక యాప్  ద్వారా వివరాల నమోదు
– రేపటినుండి ప్రారంభం కానున్న సర్వే 
– పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ పూర్తి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తీరు తెన్నులపై ప్రభుత్వం ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాం లో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం పనితీరును తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. వారు తమ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి భగీరథ పథకం నల్లా కనెక్షన్ల వివరాలను తెలుసుకోనున్నారు. సోమవారం నుంచి ఈ సర్వేను జిల్లాలో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు  శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో జిల్లా పంచాయతీ అధికారి మురళి, మిషన్ భగీరథఅధికారుల సమక్షంలో శిక్షణ ఇచ్చారు. ఉదయం దేవరకొండ డివిజన్, మధ్యాహ్నం మిర్యాలగూడ, సాయంత్రం నల్లగొండ డివిజన్ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులకు  శిక్షణ పూర్తయింది. కాగా  చిన్న గ్రామాల్లో కార్యదర్శులు సర్వే చేయాల్సి ఉంటుంది. పెద్ద పంచాయతీల్లో కార్యదర్శులతో పాటు, అంగన్వాడీలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు  చేయిస్తారు.
యాప్ లో వివరాలు నమోదు..
తాగునీటి సర్వే కోసం ప్రత్యేకంగా ఓ యాప్  (మిషన్ భగీరథ అప్లికేషన్) ను   రూపొందించారు. సెక్రెటరీలు ఈ యాప్లోనే నల్లా కనెక్షన్ల వివరాలు నమోదు చేస్తారు. ప్రతి సెక్రటరీకి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తారు. గ్రామంలో ఎన్ని నివాసిత ప్రాంతాలు (హ్యాబిటేషన్లు) ఉన్నాయి. అందులో ఎన్ని ఇండ్లు ఉన్నాయి. ఎన్ని ఇండ్లకు మిషన్భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సిన ఇండ్లు ఏమైనా ఉన్నాయా? ఉన్న కనెక్షన్ల ద్వారా ఇంటి అవసరా లకు సరిపోయేంత నీరు సరఫరా అవుతుందా? అనే వివరాలను నమోదు చేయాలని నిర్ణయించారు. ఇంటి ఫొటోతో పాటు, నల్లా కనెక్షన్ ఫొటో లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక నల్లా కనెక్షన్ ఉన్న ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల్లోని సభ్యుల సంఖ్య ఎంత?.. తదితర వివరాలు యాప్లో నమోదు చేస్తారు. ఎంత సమయం నల్లా వస్తోంది. ఇంకా నీటి సరఫరా పెంచాల్సిన అవసరం ఏమైనా ఉందా.? వంటి అంశాలను కూడా ఈ సర్వేలో పరిశీలించనున్నారు.
మున్సిపాలిటీలు వదిలేసి..
మున్సిపాలిటీల్లో  ఈ సర్వే మినహాయించినట్లు  తెలిసింది. మిషన్ భగీరథ తాగునీటి కనెక్షన్లపై ఇంటింటి సర్వేను పకర్బందీగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి ఆదేశించారు. ఈ సర్వే కోసం కార్యదర్శులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు పది రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని వారికి  సూచించారు.
కొత్త పైపులు అవసరమా.?
మిషన్ భగీరథ తాగునీటి పథకం కింద జిల్లాలో ప్రస్తుతం సుమారు 3.93 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగలు రిజర్వాయర్ తోపాటు మరికొన్ని ప్రాంతాల నుండి నీటి సరఫరా జరుగుతుంది.6 ఆగస్టు  2016 లో ఈ పథకం పనులను మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో ని కోమటిబండ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి  ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి  ప్రారంభించారు.   అయితే ఈ పథకం ప్రారంభించినప్పటికీ.. ఇప్పటికీ ఇండ్ల నిర్మాణాలు భారీగా జరిగాయి. మరోవైపు కొత్త కాలనీలు కూడా వెలిశాయి. దీంతో చాలా కాలనీలకు మిషన్ భగీరథ తాగునీటి కనెక్షన్లు ఇవ్వలేదు. వీటికి కనెక్షన్లు ఇవ్వాలంటే ఏమైనా కొత్తగా పైప్ లైన్లు వేయాల్సి ఉంటుందా అనే వివరాలు ఈ సర్వే తేలే అవకాశాలున్నాయి.
సర్వే ఆంతర్యం ఏంటి..?
మిషన్ భగీరథ నల్ల కలెక్షన్ల పై ప్రభుత్వం చేపడుతున్న సర్వే ఆంతర్యం ఏంటో  అధికారులకు కూడా  అంతుచిక్కడం లేదు. నల్ల కలెక్షన్ల వివరాలను తెలుసుకొని, కనెక్షన్ లేని వారికి కలెక్షన్లను ఇప్పించడం కోసమా? నీటి సరఫరాను మరింత పెంచడానికా? లేదా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరున ఎంత ఖర్చు చేశారో తెలుసుకోవడానికా అనేది సర్వే అనంతరం తేలనుంది.
Spread the love