Wednesday, May 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతైవాన్ ట్రావెలాగ్ నవలకు బుకర్ ప్రైజ్

తైవాన్ ట్రావెలాగ్ నవలకు బుకర్ ప్రైజ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తైవానీస్ ఆహారం, ప్రేమ, వలస పాలన నేపథ్యంలో సాగిన ఒక ప్రత్యేక కథకు చెందిన నవల ఈ ఏడాది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. తైవానీస్ రచయిత్రి యాంగ్ షువాంగ్-జి రచించిన తైవాన్ ట్రావెలాగ్ నవలకు 2026 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లభించింది. ఈ రచనను మాండరిన్ చైనీస్ నుండి ఆంగ్లంలోకి లిన్ కింగ్ అనువదించారు. ఈ నవల 1938 నాటి తైవాన్ నేపథ్యంలో సాగుతుంది. నాగసాకికి చెందిన జపనీస్ రచయిత్రి అయోమా చిజుకో, జపాన్ కాలనీగా ఉన్న తైవాన్‌కు ప్రభుత్వ పర్యటనలో భాగంగా వస్తుంది. అధికారిక కార్యక్రమాల కంటే అక్కడి ఆహారం, సంస్కృతి పట్ల ఆకర్షితురాలైన ఆమె, చిజురు అనే తైవానీస్ మహిళతో స్నేహం పెంచుకుంటుంది. ఆ స్నేహం క్రమంగా భావోద్వేగపూరిత ప్రేమకథగా మారుతుంది. ఒకరు సామ్రాజ్య దేశానికి చెందినవారు, మరొకరు వలస ప్రాంతానికి చెందినవారు కావడంతో వారి సంబంధం వలస పాలనలోని అధికార సంబంధాలను కూడా ప్రతిబింబిస్తుంది. ప్రేమ, రాజకీయాలు, సంస్కృతి, గుర్తింపు వంటి అనేక అంశాలను నవల లోతుగా పరిశీలిస్తుంది.

లండన్‌లోని టేట్ మోడర్న్‌ లో మే 19న జరిగిన కార్యక్రమంలో న్యాయనిర్ణేతల మండలి ఈ అవార్డును ప్రకటించింది. జ్యూరీ చైర్ నటాషా బ్రౌన్ మాట్లాడుతూ, “ఈ నవల ప్రేమకథగా మాత్రమే కాకుండా వలసానంతర సాహిత్యంగా కూడా అద్భుత విజయాన్ని సాధించింది” అని ప్రశంసించారు. మాండరిన్ చైనీస్ నుండి అనువదించబడి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి నవలగా ‘తైవాన్ ట్రావెలాగ్’ చరిత్ర సృష్టించింది. అలాగే యాంగ్ షువాంగ్-జీ రచనల్లో ఆంగ్లంలోకి అనువదించబడిన తొలి పుస్తకం కూడా ఇదే.

ఈ అవార్డుతో లభించే £50,000(సుమారు ₹64 లక్షల రూపాయిలు) నగదు బహుమతిని రచయిత్రి యాంగ్ షువాంగ్-జీ మరియు అనువాదకురాలు లిన్ కింగ్ సమానంగా పంచుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -